చదవాల్సిన పుస్తకం!

మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే.

Published : 21 May 2024 05:39 IST

మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో అందరికీ విద్యా రంగంలో అవకాశాలు ఎలా కల్పించవచ్చనే అంశంపైన దీన్లో సమగ్రంగా వివరించారు సల్మాన్‌ఖాన్‌(ఖాన్‌ అకాడమీ వ్యవస్థాపకులు). 

 ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు  


ఎనర్జీ లిటరసీ తెలుసుకోవాలి!

మనం చేసే ప్రతి పనిలోనూ, ఉపయోగించే ప్రతి వస్తువు వెనకా విద్యుత్, ఇంధన వినియోగం ఉంటుంది. అందులో 85 శాతం బొగ్గు, కర్బన ఇంధనాల నుంచే వస్తోంది. ఫ్రిజ్‌ ఒక రోజుపాటు, ఏసీ ఒక గంటపాటు వాడితే ఒక యూనిట్‌ విద్యుత్‌ ఖర్చవుతుంది. దానిద్వారా కేజీ కార్బన్‌డైఆక్సైడ్‌ విడుదలవుతుంది. అది 300 ఏళ్లపాటు వాతావరణంలో ఉంటూ.. భూతాపానికి దారి తీస్తుంది. విద్యుత్, ఇంధన వినియోగంలో అవగాహన పెంచుకుంటే వాటి వృథాని అరికట్టవచ్చు. ‘ఎనర్జీ లిటరసీ’ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 

‘యూట్యూబ్‌’లో ప్రొఫెసర్‌ చేతన్‌ సింగ్‌ సోలంకి, సోలార్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా


తేనెటీగలు ఉంటేనే మనకు ఆహారం

తేనెటీగల సంఖ్య తగ్గిపోవడం అంటే మనం ఆహారాన్ని కోల్పోవడమే. 85 శాతం మొక్కలు తేనెటీగల కారణంగానే మనుగడ సాధిస్తున్నాయి. మనం తినే ఆహారంలో మూడో వంతు వాటి మీదే ఆధారపడి ఉంది. అవి మన ఆహార భద్రతకు వెన్నెముక.  రసాయనాల వినియోగం, కాలుష్యం కారణంగా తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. 

 ‘ఎక్స్‌’లో పర్వీణ్‌ కాసవాన్, ఐఎఫ్‌ఎస్‌ అధికారి  


మోదీపై పోటీ చేసేవారి సంఖ్య తగ్గుతోంది ఎందుకో!

నరేంద్ర మోదీ 2014లో తొలిసారిగా వారణాసిలో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అక్కడి నుంచి మరో 41 మంది బరిలో ఉన్నారు. 2019లో మరోసారి మోదీ వారణాసి నుంచి బరిలో నిలిచినప్పుడు అభ్యర్థుల సంఖ్య 25కు తగ్గింది. 2024 ఎన్నికల్లో మోదీపై పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య  ఆరుకు పడిపోయింది! అక్కడ నామినేషన్లు తిరస్కరణకు గురైన వారిలో నేనూ ఒకడిని. ఇక 2029లో వారణాసి ఎన్నికల పరిస్థితి ఊహించుకుంటేనే  ఆందోళనగా ఉంది.

 ‘ఎక్స్‌’లో శ్యామ్‌ రంగీలా, కమెడియన్‌  


వాళ్లంతా మన పిల్లలు కాదా!

ఎవరి పిల్లలు బానిసత్వంలో చిక్కుకున్నారు?ఎవరి పిల్లలు యుద్ధాల్లో, హింసాత్మక సంఘర్షణలలో మరణిస్తున్నారు, వికలాంగులవుతున్నారు? ఎవరి పిల్లలు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు? వాళ్లంతా మన పిల్లలే. 56 కామన్వెల్త్‌ దేశాలకు చెందిన 12.3కోట్ల మంది పిల్లలు పాఠశాలల బయటే ఉంటున్నారు. వాళ్లందరి గురించీ తక్షణమే ఆలోచించడం మన నైతిక బాధ్యత, వారి కన్నీళ్లకు మనదే జవాబుదారీతనం. 

‘ఎక్స్‌’లో కైలాశ్‌ సత్యార్థి, నోబెల్‌ గ్రహీత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని