ఆ బంగ్లాదేశ్‌ ఎంపీది హత్యే! - బెంగాల్‌ పోలీసులు

తొమ్మిది రోజులుగా ఆచూకీ లేకుండాపోయిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వర్‌ ఉల్‌ అజీమ్‌ హత్యకు గురైనట్లు కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.

Published : 22 May 2024 21:22 IST

కోల్‌కతా: భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ పార్లమెంటు సభ్యుడు అన్వర్‌ ఉల్‌ అజీమ్‌ (Anwar Ul Azim) ప్రాణాలు కోల్పోవడం పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. తొమ్మిది రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన ఆయన.. చనిపోయిన విషయాన్ని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన బెంగాల్‌ సీఐడీ.. ఆ ఎంపీది హత్యేనని ప్రాథమికంగా నిర్ధరించారు. అయితే, మృతదేహాన్ని మాత్రం ఇంకా గుర్తించలేదన్నారు.

‘‘బంగ్లాదేశ్‌ ఎంపీ కోల్‌కతాకు వచ్చినట్లు మాకు ముందస్తు సమాచారం లేదు. అతను అదృశ్యమైనట్లు తన స్నేహితుడు గోపాల్‌ బిశ్వాస్‌ మే 18న ఫిర్యాదు చేయడంతో ఆ విషయం మాకు తెలిసింది. విచారణ కొనసాగుతున్న సమయంలోనే మే 20న కేంద్ర హోంశాఖ నుంచి మాకు సమాచారం వచ్చింది. ఆ క్రమంలోనే ఆయన చనిపోయినట్లు ఈ రోజు తెలిసింది. దాన్ని హత్యగా భావిస్తున్నాం. మృతదేహం ఇంకా లభ్యం కాలేదు’’ అని సీఐడీ ఐజీ అఖిలేశ్‌ చతుర్వేది వెల్లడించారు. అయితే, అతడిని హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.

కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు.. 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

ఎంపీ మృతిపై అటు బంగ్లాదేశ్‌ హోంశాఖ స్పందించింది. కోల్‌కతాలోని ఓ నివాసంలో ఆయన దారుణ హత్యకు గురయ్యారని తెలిపింది. ఈనేపథ్యంలో దోషులను పట్టుకోవడంతోపాటు హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో భారత్‌, బంగ్లాదేశ్‌ పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయని పేర్కొంది.

బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌ పార్టీకి చెందిన అన్వర్‌ ఉల్‌ అజీమ్‌ (Anwarul Azim).. చికిత్స నిమిత్తం ఇటీవల పశ్చిమబెంగాల్‌కు వచ్చినట్లు సమాచారం. మే 12న కోల్‌కతా శివారులో ఉన్న తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్‌ ఇంట్లో బసచేసిన ఆయన.. వెంటనే వస్తానంటూ ఇంటినుంచి బయటకు వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. దాదాపు తొమ్మిది రోజుల తర్వాత ఆయన హత్యకు గురైనట్లు వెల్లడైంది. జెనైదా-4 నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అజీమ్.. మూడుసార్లు ఎంపీగా గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని