మద్యం మత్తులో ఇద్దరిని బలిగొన్న బాలుడి బెయిల్‌ రద్దు

మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుడి(17) బెయిల్‌ను జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బుధవారం రద్దు చేసింది. వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్‌ హోంలో ఉంచాలని ఆదేశించడంతో పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.

Published : 23 May 2024 05:21 IST

మైనర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు   

పుణె: మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుడి(17) బెయిల్‌ను జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బుధవారం రద్దు చేసింది. వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్‌ హోంలో ఉంచాలని ఆదేశించడంతో పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. గత ఆదివారం మద్యం మత్తులో కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కేసులో.. గంటల్లోనే బాలుడికి బెయిల్‌ మంజూరు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు వద్దకు వెళ్లి, ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరారు. ఈ ప్రమాదాన్ని అతి క్రూరమైన చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తాజాగా బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలను సవరించింది. బాలుడిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, మైనర్‌కు వాహనం ఇచ్చినందుకు ఇప్పటికే అతడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌తోపాటు మద్యం సరఫరా చేసినందుకు హోటల్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం బాలుడి తండ్రిని పోలీసులు సెషన్స్‌ కోర్టుకు తీసుకురాగా.. కొందరు ఇంక్‌ చల్లి నిరసన తెలపడం గమనార్హం. మరోవైపు ఆ బాలుడికి డ్రైవింగ్‌ లైసెన్సుపై నిషేధం విధిస్తున్నామని, 25 ఏళ్లు వచ్చేంతవరకు జారీ చేయబోమని మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వివేక్‌ భిమన్వార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని