సెలవుల్లోనూ అర్ధరాత్రి వరకూ జడ్జీలు పనిచేస్తుంటారు!

వ్యాజ్యాల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు అవిశ్రాంతంగా పని చేస్తుంటారని సుప్రీంకోర్టు తెలిపింది. సెలవు రోజుల్లోనూ అర్ధ రాత్రి వరకు ఆయా కేసుల తీర్పులకు సంబంధించి కసరత్తు జరుగుతూనే ఉంటుందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన సెలవు కాలీన ధర్మాసనం బుధవారం పేర్కొంది.

Published : 23 May 2024 05:24 IST

తక్కువగా పనిచేస్తున్నారనే వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు విచారం

దిల్లీ: వ్యాజ్యాల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు అవిశ్రాంతంగా పని చేస్తుంటారని సుప్రీంకోర్టు తెలిపింది. సెలవు రోజుల్లోనూ అర్ధ రాత్రి వరకు ఆయా కేసుల తీర్పులకు సంబంధించి కసరత్తు జరుగుతూనే ఉంటుందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన సెలవు కాలీన ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించడానికి ఆ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం రెండు నెలల సమయం తీసుకుందంటూ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఫిర్యాదు చేయగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఇది చాలా దురదృష్టకరం. జడ్జీలుగా తాము నిరంతరంగా శ్రమిస్తున్నా సక్రమంగా పనిచేయటంలేదనే విమర్శలు వినాల్సి వస్తోంది. జడ్జీలు కూడా హోంవర్క్‌ చేయాల్సి వస్తుంది’ అని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా అన్నారు. ‘ఆ జడ్జీలు ప్రస్తుతం మన ముందు లేరు. తీర్పు వెలువరించకుండా ఏ పరిస్థితులు నివారించాయో వారు వివరించలేరు. వారికి సంశయ లబ్ధి కల్పిద్దాం’ అని పేర్కొన్నారు. తీర్పుల్లో జాప్యం పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కపిల్‌ సిబల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరెస్టు అయిన వ్యక్తులు తమ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తోందన్నారు. సత్వర విచారణకు సర్వోన్నత న్యాయస్థానం కొన్ని మార్గదర్శకాలను వెలువరించిందని ధర్మాసనం గుర్తు చేసింది. వివిధ హైకోర్టుల్లో ఎదురవుతున్న వాస్తవ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని కపిల్‌ సిబల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని