ఎయిమ్స్‌ ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వాహనం

ఓ నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తమ వాహనంతో ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Updated : 24 May 2024 05:35 IST

ఆరో అంతస్తుకు వెళ్లి మరీ  నిందితుడి అరెస్టు  

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తమ వాహనంతో ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. సర్జరీ యూనిట్‌లో విధుల్లో ఉన్న సమయంలో నర్సింగ్‌ ఆఫీసర్‌ తనను లైంగికంగా వేధించారంటూ రెండురోజుల క్రితం ఒక జూనియర్‌ డాక్టర్‌ ఆరోపించింది. ఆ తర్వాత అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఇతర వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడిని విధుల నుంచి తొలగించాలని గురువారం నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నర్సింగ్‌ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేరుకోగా.. బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూసి తమ వాహనంతో నేరుగా ఆరో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఎయిమ్స్‌ యాజమాన్యం నిందితుడిపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని