బఛేంద్రీ పాల్‌ ‘ఎవరెస్టు’ సంబరాలు

ఎవరెస్టు శిఖరంపై తాను కాలుమోపి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రఖ్యాత పర్వతారోహకురాలు బఛేంద్రీ పాల్‌.. ఆ అనుభవాన్ని మరోసారి పొందాలని భావించారు. ప్రపంచంలోనే ఎత్తైన ఈ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా అయిన ఆమె..

Published : 26 May 2024 04:38 IST

పర్వతాన్ని అధిరోహించి 40 ఏళ్లు పూర్తైన  సందర్భంగా బేస్‌క్యాంపు వరకు ట్రెక్కింగ్‌

కాఠ్‌మాండూ: ఎవరెస్టు శిఖరంపై తాను కాలుమోపి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రఖ్యాత పర్వతారోహకురాలు బఛేంద్రీ పాల్‌.. ఆ అనుభవాన్ని మరోసారి పొందాలని భావించారు. ప్రపంచంలోనే ఎత్తైన ఈ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా అయిన ఆమె.. ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు ట్రెక్కింగ్‌ చేయడం ద్వారా ఆ సందర్భాన్ని వేడుకగా జరుపుకొన్నారు. 71 ఏళ్ల పాల్‌తో పాటు ఆమె ప్రారంభించిన వుమెన్‌ అడ్వెంచర్‌ నెట్వర్క్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఏఎన్‌ఐ) సభ్యులు కొందరు, తనతో గతంలో ఎవరెస్టును అధిరోహించిన సహచరులు మరికొందరు.. మొత్తం 15 మంది ఈ బేస్‌క్యాంప్‌ యాత్రలో పాల్గొన్నారు. ఎవరెస్టు యాత్రకు ఒకప్పుడు ప్రారంభ స్థానమైన నేపాల్‌లోని జిరీ నుంచి మే 9న వీరంతా ట్రెక్కింగ్‌ ప్రారంభించారు. ఈ బృందానికి దారి మధ్యలో 81 ఏళ్ల బ్రిగేడియర్‌ దర్శన్‌ కుమార్‌ ఖుల్లార్‌ జత కలిశారు. హిమాలయన్‌ మౌంటనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌ఎంఐ) ప్రిన్సిపాల్‌గా ఖుల్లార్‌ ఉన్న సమయంలోనే 1984లో పాల్‌.. 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును తొలిసారి అధిరోహించారు. అలా వీరు ట్రెకింగ్‌ చేసి 18 వేల అడుగుల ఎత్తున ఉన్న ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు గురువారం చేరుకుని యాత్రను ముగించారు. 1984 యాత్రకు సహాయ సహకారాలు అందించిన టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌.. (టీఎస్‌ఏఎఫ్‌) ఈ యాత్రకూ సహకరించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని