సంక్షిప్త వార్తలు

చాలా మంది ప్రణాళికలు వేసుకొని కూడా పనిని మొదలుపెట్టకపోవడానికి ముఖ్య కారణం ఫలితాలపై అనిశ్చితి, భయం.

Updated : 29 May 2024 05:40 IST

వాయిదా వేసేకొద్దీ సమయం వృథా
- నికోలస్‌ కోల్, డిజిటల్‌ రైటర్‌

చాలా మంది ప్రణాళికలు వేసుకొని కూడా పనిని మొదలుపెట్టకపోవడానికి ముఖ్య కారణం ఫలితాలపై అనిశ్చితి, భయం. ఇందులో నేను విఫలం అవుతానేమో.. దీనికి వెచ్చించిన  సమయమంతా వృథా అవుతుందేమో అని భావిస్తుంటారు. వాస్తవానికి పనిని మొదలుపెట్టకుండా ఖాళీగా ఉండటం వల్లనే సమయం వృథా అవుతుంటుంది. దానివల్ల మీకు తక్కువ సమయమే మిగిలి భయాందోళనలు మరింత పెరుగుతాయి. అందుకే ఫలితాల గురించి ఆలోచించకుండా ఆచరణలోకి దిగండి.


ఆనందంగా ఉంటున్నారా? అలా కనిపిస్తున్నారా? 

- అంకుర్‌ వారికూ, కంటెంట్‌ క్రియేటర్‌

మీరు ఆనందంగా ఉండాలను కుంటున్నారా? ఆనందంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ రెండింటికి దారులు భిన్నం. మీ మనస్తత్వానికి, అభిరుచులకు  అనుగుణంగా జీవిస్తే ఆనందంగా ఉంటారు. ఆనందంగా కనిపించాలని  ప్రయత్నిస్తున్నారంటే మాత్రం సమాజం ఒత్తిళ్లకు లొంగి మీది కాని జీవితాన్ని  కొనసాగిస్తున్నారని అర్థం. అలాగే మీకు ఉత్సాహం కలిగించని వేరెవరో నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్నా మీకు విజయం సాధించిన ఆనందం కలగదు.


నెట్‌వర్కింగ్‌కు అర్థం ఇదీ..

- డేవిడ్‌ లవ్‌జాయ్, మార్కెటింగ్‌ నిపుణులు

రోజుల్లో వృత్తిపరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రతిభ, కష్టపడే స్వభావంతోపాటు నెట్‌వర్కింగ్‌ కీలకంగా మారింది. మన పరిధిని విస్తృతం చేసుకోవాలంటే అది తప్పనిసరి. అయితే నెట్‌వర్కింగ్‌ అంటే బిజినెస్‌ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం కాదు. సత్సంబంధాల విత్తనాలను నాటడం. కాలంతోపాటు అవి వృక్షాలుగా మారి మనకు ఫలాలనిస్తాయి.


ఎటువైపు ఆకర్షితులవుతున్నారు? 

- వాలా అఫ్సర్, కాలమిస్టు

ఇటువైపు వద్దు: డబ్బు, హోదా, ఆహార్యం, అనుభవం, అనుకరణ, విశేషణాలు.

ఇటువైపు వెళ్లండి: దయ, కరుణ, నమ్మకం, నిస్వార్థం, వినయం, విధేయత, స్వీయ అవగాహన- ధైర్యం, నిజాయతీ, పరోపకారం


సోరెన్‌ బెయిలు పిటిషన్‌పై ఈడీ స్పందనకు హైకోర్టు ఆదేశం

రాంచీ: బెయిలు కోసం ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ చేసుకున్న దరఖాస్తుపై స్పందన తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు ఝార్ఖండ్‌ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 10న చేపడతామని తెలిపింది. ఒక భూ కుంభకోణం కేసులో అక్రమ ధనాన్ని సక్రమమైనదిగా చలామణి చేశారంటూ సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేసుపై త్వరగా విచారణ జరపాలని సోరెన్‌ సోమవారంనాడు హైకోర్టుకు పిటిషన్‌ పెట్టారు. బర్గైన్‌ సర్కిల్‌లో 8.5 ఎకరాల భూమి కబ్జా అయిందని ఆరోపిస్తున్నారనీ, దస్తావేజులలో తనపేరు ఎక్కడా లేదని తెలిపారు. నగదు అక్రమ చలామణి నిరోధ చట్టం (పీఎంఎల్‌యే) కింద కూడా తనపై నేరాభియోగం దాఖలు చేయలేదని వివరించారు. కొందరు నోటిమాటగా చెప్పిన అంశాలను ఈడీ పరిగణనలోకి తీసుకుందని చెప్పారు.


సందేశ్‌ఖాలీ ఘటన నిందితులపై హత్యానేర అభియోగాలు మోపిన సీబీఐ 

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై జనవరి 5న మూకుమ్మడి దాడికి పాల్పడినందుకు తృణమూల్‌ బహిష్కృతనేత షాజహాన్‌ షేక్, అతని సోదరుడు ఆలంగీర్, మరో ఐదుగురిపై.. సీబీఐ అభియోగాలు మోపింది. వారంతా నేరపూరిత కుట్రకు, హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బశీర్‌హాట్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం తొలి అభియోగపత్రం దాఖలు చేసింది. బెంగాల్‌లో రేషన్‌ పంపిణీ కుంభకోణం కేసులో షేక్‌ నివాసంలో సోదాలకు ఈడీ బృందం వెళ్లినప్పుడు దాదాపు వెయ్యిమంది మూక వారిపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే.


విందులో ఆహారం విషతుల్యమై రాజస్థాన్‌లో నలుగురి మృతి

ఉదయ్‌పుర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ జిల్లాలో ఆహారం విషతుల్యంగా మారి నలుగురు మృతిచెందగా, మరో 30 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి సావన్‌ క్యారా గ్రామంలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో దాదాపు 80 మంది పాల్గొన్నారు. రాత్రి భోజనం చేసిన వెంటనే పలువురు కడుపు నొప్పిగా ఉందని వాంతులు చేసుకోవడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. బాధితుల్లో 12 మందిని మెరుగైన చికిత్స కోసం గుజరాత్‌కు తరలించారు.


బిభవ్‌ కుమార్‌కు మరో 3 రోజుల కస్టడీ

దిల్లీ: ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను మరో మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీలో ఉంచేందుకు దిల్లీ కోర్టు మంగళవారం అనుమతించింది. ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దాడి ఆరోపణ కేసులో బిభవ్‌ కుమార్‌ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, అయిదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని దిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ గౌరవ్‌ గోయల్‌ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అనుమతించారు.


పాపువా న్యూగినీకి భారత్‌ రూ.8.31 కోట్ల సాయం 

దిల్లీ: పాపువా న్యూగినీకి భారత్‌ రూ.8.31 కోట్ల ఆర్థికసాయం ప్రకటించింది. శుక్రవారం కొండచరియలు విరిగిపడి ఆ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లో రెండు వేలకు పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయి. సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఆ దేశం అంతర్జాతీయ సాయాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. న్యూగినీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంగళవారం విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని