ఒక విమానం ఎగరకముందే.. అదే రన్‌వేపై మరొకటి దిగింది

దాదాపు 300 మంది ప్రయాణికులకు శనివారం ముంబయి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అవుతుండగా.. అదే రన్‌వేపైకి ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌ దిగింది.

Published : 10 Jun 2024 05:33 IST

 ముంబయిలో ఘటన


ఒకే రన్‌వేపై వెనుకాముందు రెండు విమానాలు

ముంబయి: దాదాపు 300 మంది ప్రయాణికులకు శనివారం ముంబయి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అవుతుండగా.. అదే రన్‌వేపైకి ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌ దిగింది. రెండింటికి మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బందిని విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. రెండు విమానాలు ఒకే రన్‌వేపైకి వచ్చి క్షణాల వ్యవధిలో తప్పిన పెనుప్రమాదం వీడియో వైరల్‌గా మారింది. ఎయిరిండియా విమానం తిరువనంతపురానికి వెళ్లేందుకు గాల్లోకి ఎగరబోతున్న తరుణంలో.. ఇందౌర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్‌ అయింది. ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ.. తమ పైలట్‌ ముంబయి ఎయిర్‌పోర్టు ఏటీసీ సూచనలను తూచా తప్పకుండా పాటించాడని పేర్కొంది. ‘‘జూన్‌ 8న ఇండిగో 6ఈ6053 విమానానికి ఏటీసీ నుంచి ల్యాండింగ్‌ క్లియరెన్స్‌ లభించింది. నిబంధనల ప్రకారం ఈ ఘటనపై మేం రిపోర్టు చేశాం’’ అని ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఎయిరిండియా కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ‘‘ఏఐ657 తిరువనంతపురం వెళ్లే విమానానికి ఏటీసీ నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే బయల్దేరాం. అసలు అధికారులు ఎలా క్లియరెన్స్‌ ఇచ్చారనేది తెలియాల్సి ఉంది’’ అని పేర్కొంది. ముంబయి విమానాశ్రయంలో రెండు క్రాసింగ్‌ రన్‌వేలతోపాటు సింగిల్‌ రన్‌వే వినియోగంలో ఉంది. గంటకు 46 విమానాలు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిబంధనల ప్రకారం.. టేకాఫ్‌ అవుతున్న విమానం రన్‌వే చివరిభాగాన్ని దాటాలి లేదా మలుపు తీసుకోవాలి. అప్పుడే ఏటీసీ మరో విమానానికి ల్యాండింగ్‌ క్లియరెన్సు ఇవ్వాల్సి ఉంటుంది.   

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని