ఏడాదైనా మణిపుర్‌లో శాంతిలేదు

జాతుల సంఘర్షణతో అట్టుడికిన మణిపుర్‌లో హింస చెలరేగి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనలేదని అరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Published : 11 Jun 2024 05:26 IST

అక్కడ హింసను అరికట్టాలి
ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ 

నాగ్‌పుర్‌: జాతుల సంఘర్షణతో అట్టుడికిన మణిపుర్‌లో హింస చెలరేగి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనలేదని అరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  ఆ రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోవాలని, హింసను అరికట్టాలని కోరారు. నాగ్‌పుర్‌లో రెషింబాగ్‌లోని హెడ్గేవర్‌ స్మృతి భవన్‌ ఆవరణలో సోమవారం జరిగిన ‘కార్యకర్త వికాస్‌ - ద్వితీయ’ ముగింపు కార్యక్రమంలో ఆరెస్సెస్‌ శిక్షార్థులను ఉద్దేశించి భాగవత్‌ ప్రసంగించారు. సమాజంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగే సంఘర్షణలు మంచివికావని హితవు పలికారు. దేశంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత ఉండాలన్నారు. దేశంలో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ మనమంతా ఒకటే తప్ప భిన్నం కాదనే విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. ఆకట్టుకునే ఎన్నికల ప్రచారాలను పక్కనపెట్టి దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని భాగవత్‌ పేర్కొన్నారు. ‘‘ఏడాది కాలంగా శాంతి కోసం మణిపుర్‌ ఎదురుచూస్తోంది. 10 ఏళ్ల క్రితం ఆ రాష్ట్రంలో శాంతి పరిఢవిల్లింది. తుపాకీ సంస్కృతి అంతమైపోయినట్లుగా అనిపించింది. అకస్మాత్తుగా మళ్లీ హింస ప్రజ్వరిల్లింది. రాష్ట్రంలోని పరిస్థితిని ప్రాధాన్యత అంశంగా పరిగణించి అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలి’’ అని భాగవత్‌ అన్నారు. మణిపుర్‌లో జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు ఇటీవల రెండు పోలీస్‌ అవుట్‌ పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతో పాటు స్థానికుల 70 ఇళ్లను తగలబెట్టారు. మరోవైపు.. కాంగ్‌పోక్పి జిల్లాలో సీఎం భద్రత కాన్వాయ్‌పై సాయుధులు కాల్పులు జరిపారు. ఈ తాజా ఘటనల నేపథ్యంలో భాగవత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని