షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ న్యాయసమ్మతమే

జాతీయ రాజధాని దిల్లీలో అల్లర్ల కేసు(2020)తో ముడిపడిన దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి నాయకుడు షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ మంజూరు న్యాయసమ్మతమేనని దిల్లీ హైకోర్టు పేర్కొంది.

Published : 11 Jun 2024 05:27 IST

నిరాకరణకు సమర్థ కారణాలేవీ లేవు: హైకోర్టు

దిల్లీ: జాతీయ రాజధాని దిల్లీలో అల్లర్ల కేసు(2020)తో ముడిపడిన దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి నాయకుడు షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ మంజూరు న్యాయసమ్మతమేనని దిల్లీ హైకోర్టు పేర్కొంది. అతనికి బెయిల్‌ నిరాకరించడానికి సమర్థమైన కారణాలేవీ లేవని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్, జస్టిస్‌ మనోజ్‌ జైన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇమామ్‌పై ఉన్న పలు తీవ్రమైన ఆరోపణల కారణంగా ట్రయల్‌ కోర్టు అతనికి ఉపశమనం కలిగించే విషయంలో ఊగిసలాడుతోందని తెలిపింది. ఇమామ్‌ గత నాలుగేళ్లకు పైగా జైలులో ఉండగా మే 29న దిల్లీ హైకోర్టు ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. ఆ ఉత్తర్వు న్యాయస్థానం వెబ్‌సైట్‌లో తాజాగా అప్‌లోడ్‌ అయ్యింది. బెయిల్‌ నిరాకరించడానికి నిందితునిపై తీవ్రమైన నేరారోపణలు ఉండటమే కారణం కారాదని ధర్మాసనం పేర్కొంది. మోపిన నేరాభియోగాలు నిరూపితమైతే విధించే శిక్షా కాలంలో గరిష్ఠంగా సగానికి మించిన రోజులు కన్నా అధిక సమయం విచారణ ఖైదీగా జైలులో ఉండటానికి నేరశిక్షాస్మృతి 436-ఎ సమ్మతించబోదని తెలిపింది. ఆ పరిమితికి మించి నిందితుడిని జైలులోనే ఉంచడానికి సహేతుకమైన కారణం ఉండాలని పేర్కొంది. కేసు విచారణలో జాప్యానికి నిందితుడిని బాధ్యుడిగా చేయలేమంటూ పోలీసుల అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. అయితే, మరికొన్ని ఇతర కేసుల్లో షర్జీల్‌ ఇమామ్‌ నిందితుడిగా ఉన్నందున జైలు నుంచి విడుదల కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని