Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్‌: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో

Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

Updated : 18 Mar 2024 10:47 IST

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా (Russia) పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు (Indians) ఊహించని విధంగా అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ (Ukraine)తో యుద్ధంలో మాస్కో సైన్యానికి (Russian Army) సహాయకులుగా పనిచేస్తున్న వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వారు మరో వీడియో విడుదల చేశారు. తమను కాపాడాలంటూ కేంద్రాన్ని వేడుకొన్నారు.

రష్యా ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న ఆరుగురు భారతీయులు ఉక్రెయిన్‌లోని జపొరిజియా ఓబ్లాస్ట్‌ ప్రాంతంలో ఈ వీడియోను చిత్రీకరించారు. వీరంతా పంజాబ్‌, హరియాణాకు చెందిన వారిగా తెలుస్తోంది. ‘‘మోదీజీ మేం రష్యా సైన్యంలో చిక్కుకుపోయాం. మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలుసు. మాస్కోలోని భారత ఎంబసీని సంప్రదించి వీలైనంత త్వరగా మమ్మల్ని విడిపించండి ప్లీజ్‌..!’’ అంటూ 26 సెకన్ల వీడియోలో వారు కేంద్రాన్ని వేడుకున్నారు.

నావల్నీని విడిచిపెట్టాలనుకున్నాం.. ప్రత్యర్థి మృతిపై పుతిన్‌ తొలి స్పందన

ఈ నెల ఆరంభంలోనూ ఈ బృందం ఓ వీడియో విడుదల చేసింది. ‘‘హెల్పర్లుగా మాత్రమే పనిచేయాలని తొలుత మాకు చెప్పారు. కానీ, ఆ తర్వాత సాయుధ శిక్షణలో పేరు నమోదు చేశారు. ఉక్రెయిన్‌లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు ఆహారం పెట్టడంలేదు.. ఫోన్లు లాక్కొన్నారు’’ అంటూ నాడు ఆవేదన వ్యక్తం చేశారు. తాజా వీడియోతో వారిని యుద్ధభూమిలోకి పంపినట్లు స్పష్టమవుతోంది.

వీరంతా గతేడాది డిసెంబరు 27న నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు రష్యా వెళ్లినట్లు తెలిసింది. 90 రోజుల వీసాపై మాస్కో చేరుకున్న తమను ఏజెంట్‌ బెలారస్‌కు తీసుకెళ్లినట్లు బాధితుల్లో ఒకరు గత వీడియోలో వెల్లడించారు. అక్కడ ఆ మధ్యవర్తి తమను వదిలేసి వెళ్లిపోయారని, స్థానిక పోలీసులు పట్టుకుని రష్యా అధికారులకు అప్పగించారని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

భారత్‌ నుంచి దాదాపు 100 మంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారన్న సమాచారంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మాస్కోతో చర్చలు జరిపి కొంతమందిని విడిపించినట్లు పేర్కొంది. మరికొందరు అక్కడే పనిచేస్తున్నారని, వారినీ బయటకు తీసుకొచ్చేందుకు రష్యా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నామని కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని