Arvind Kejriwal: ‘జూన్‌ 2న లొంగిపోతా.. నా తల్లిదండ్రులు జాగ్రత్త’: కేజ్రీవాల్‌ ఉద్వేగం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మీడియాతో ఉద్వేగంగా మాట్లాడారు. తాను జైలుకు వెళ్లిన తర్వాత తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

Updated : 31 May 2024 13:57 IST

దిల్లీ: ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. జూన్‌ రెండున తిరిగి లొంగిపోనున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా తలవంచనని తన మద్దతుదారులకు వెల్లడించారు.

‘‘జూన్‌ రెండున నేను లొంగిపోవాల్సి ఉంది. ఈసారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు నేను జైలుకు వెళ్తున్నాను. అందుకు గర్వంగా ఉంది. వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నించారు. జైల్లో ఉన్నప్పుడు మెడిసిన్ అందకుండా అడ్డుకున్నారు.  అరెస్టయినప్పుడు 70 కేజీలు ఉన్నాను. అక్కడున్న సమయంలో ఆరు కేజీలు తగ్గిపోయాను. బయటకువచ్చిన తర్వాత ముందులాగా బరువు పెరగలేదు. దాంతో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతర్గతంగా ఉన్న ఆరోగ్య పరిస్థితికి ఇది ఒక సంకేతం కావొచ్చని వారు అనుమానిస్తున్నారు’’ అని వెల్లడించారు.

ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటినుంచి బయల్దేరి, పోలీసుల ముందు లొంగిపోతానని కేజ్రీవాల్ చెప్పారు. ‘‘ఈసారి తనను ఇంకా వేధింపులకు గురిచేసేలా ప్రయత్నాలు జరగొచ్చు. నేను జైలుకెళ్లిన తర్వాత.. మీ (ప్రజలు) గురించే ఎక్కువ ఆలోచిస్తాను. ఈ సమయంలో మీకు ఒక హామీ ఇస్తున్నాను. మీకు అందుతున్న సేవల్లో ఎలాంటి మార్పు ఉండదు. త్వరలో నా తల్లులు, సోదరీమణులకు రూ.1,000 అందుతాయి. ఒక కుమారుడిలా నేను మీకోసం పనిచేశాను. ఈరోజు మీకొక అభ్యర్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి’’ అని కోరారు.

రైళ్ల రద్దీ.. అమితాబ్‌ సహాయం కోరిన కాంగ్రెస్‌

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ..కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. అయితే దానిపై ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ప్రస్తుతం దిల్లీ కోర్టులో రెగ్యులర్‌, మధ్యంతర బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు