Fake Calls: టెలికాం శాఖ పేరుతో కాల్స్‌ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!

Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్‌ వస్తున్నాయా?ఫోన్‌ నంబరు డిస్‌కనెక్ట్‌ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం.

Updated : 29 Mar 2024 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ యూజర్లకు కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ (Department of Telecommunications) విభాగం శుక్రవారం ఓ అడ్వైజరీ జారీ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా మొబైల్‌ నంబరును డిస్‌కనెక్ట్‌ చేస్తామంటూ కొందరు తమ డిపార్ట్‌మెంట్‌ పేరు మీద కస్టమర్లకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని పేర్కొంది. అవన్నీ నకిలీ కాల్స్‌ (Fake Calls) అని స్పష్టం చేసింది. వాటిని వెంటనే రిపోర్ట్‌ చేయాలని సూచించింది.

‘‘టెలికాం శాఖ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్‌ నంబరును నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారు. విదేశీ మొబైల్‌ నంబర్ల నుంచి వాట్సప్‌ కాల్స్‌ చేసి ప్రభుత్వ అధికారులమని నమ్మిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌తో సైబర్‌ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతుంటారు. మా విభాగం తరఫున అలాంటి కాల్స్‌ చేయడానికి మేం ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ కాల్స్‌ వచ్చినప్పుడు ఎలాంటి సమాచారాన్ని పంచుకోవద్దు’’ అని టెలికాం విభాగం (DoT) తమ అడ్వైజరీలో పేర్కొంది.

మార్చి 31లోగా ఇవి పూర్తి చేయండి..

ఈ మోసపూరిత కాల్స్‌ గురించి యూజర్లు వెంటనే సంచార్‌ సాథీ పోర్టల్‌  (www.sancharsaathi.gov.in)లో ఫిర్యాదు చేయాలని డీఓటీ సూచించింది. ఇదే వెబ్‌సైట్‌లోని ‘నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్‌’ అనే ఆప్షన్‌కు వెళ్లి యూజర్లు తమ కనెక్షన్ల గురించి తెలుసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఈ సైబర్‌ మోసాల బారిన పడితే.. 1930 హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో రిపోర్ట్‌ చేయాలని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని