Ebrahim Raisi: రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్‌

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి నేపథ్యంలో.. ఆయన గౌరవార్థం భారత్‌లో మే 21న సంతాపదినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 20 May 2024 18:32 IST

దిల్లీ: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. ఈ క్రమంలోనే రైసీ గౌరవార్థం భారత్‌లో మే 21న ఒక రోజు సంతాప దినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతోపాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్‌ తొలి సుప్రీంలీడర్‌ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ కన్నుమూసిన సమయంలోనూ భారత్‌ మూడు రోజులు సంతాప దినాలు పాటించింది. 

ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉందా?

అంతకుముందు రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ‘‘ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆ దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇదిలాఉండగా.. ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీతోపాటు ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబొల్లహియన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్ మలేక్‌ రహ్‌మతీ తదితరులు కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు