DA hike: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 4% డీఏ పెంపు

కేంద్ర ఉద్యోగులకు 4శాతం కరవు భత్యం 4శాతం పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 1, 2024 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

Updated : 07 Mar 2024 21:34 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వచ్చేసింది. వారి కరవు భత్యం (DA) 4% పెరిగింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 46శాతం డీఏ 50శాతానికి చేరుకున్నట్లయ్యింది. జనవరి 1, 2024 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

డీఏ/డీఆర్‌ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.12,869 కోట్ల అదనపు భారం పడనున్నట్లు అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దీని ప్రభావం రూ.15,014 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.

  • భారత్‌లో కృత్రిమ మేధ (AI) అభివృద్ధి, పరిశోధనల కోసం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా.. రూ.10 వేల కోట్లతో ‘ఏఐ మిషన్‌’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా ‘ఏఐ’పై యువతకు శిక్షణ, ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు, కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకోనున్నారు.
  • గోవా శాసనసభలో షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పచ్చజెండా ఊపింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం ఎస్టీలకు రిజర్వేషన్‌ సీట్లు లేవు. జనాభా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
  • ఈశాన్య భారతం కోసం రూ.10,037 కోట్లతో కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకం ‘ఉన్నతి (UNNATI)’కి కేబినెట్‌ ఆమోదం లభించింది. సంబంధిత రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఈ పథకాన్ని రూపొందించారు. 
  • 2024-25 సీజన్‌లో ముడి జనపనారకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.285 పెంచారు. దీంతో మొత్తం ధర రూ.5,335కి చేరింది. ఈ నిర్ణయంతో తూర్పు రాష్ట్రాలు.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
  • భారత సైన్యం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అవసరాల కోసం 34 కొత్త ‘ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌’ హెలికాప్టర్ల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆర్మీకి 25, ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు తొమ్మిది చొప్పున హెలికాప్టర్లను సమకూర్చనున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారుచేయనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని