Union Budget 2024: ‘సర్వైకల్‌ క్యాన్సర్‌’కు వ్యాక్సినేషన్‌.. మరిన్ని మెడికల్‌ కాలేజీలు

Union Budget 2024: 9 - 14 ఏళ్ల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్‌ నివారణకు కీలక చర్యలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకోసం వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

Updated : 09 Jul 2024 15:26 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ (Union Budget 2024)ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి పెద్దగా కీలక పథకాల జోలికి వెళ్లని విత్త మంత్రి.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ రంగానికి (health care sector) సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు. బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు చర్యలు చేపట్టడంతో పాటు.. కొత్తగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

హెల్త్‌ కేర్‌పై నిర్మలమ్మ ప్రకటనలివే

  • వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని చాలామంది యువత ఆశ పడుతున్నారు. అందుకే, ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తాం. ఈ అంశాన్ని పరిశీలించి సంబంధిత సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని నియమిస్తాం.
  • 9 - 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండేలా వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తాం.
  • పిల్లల్లో రోగ నిరోధకత పెంచడం కోసం తీసుకొచ్చిన ‘మిషన్ ఇంద్రధనుస్సు’ను నిర్వహించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ‘యు - విన్‌’ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం.
  • మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న పథకాలను సమగ్ర ప్రోగ్రామ్‌ కిందకు తీసుకొస్తాం.
  • సాక్షమ్‌ అంగన్వాడీ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తాం. చిన్నారుల ఎదుగుదల కోసం పోషకాహార పంపిణీని మెరుగ్గా అందించేందుకు పోషణ్‌ 2.0 కార్యక్రమాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తాం.
  • ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు విస్తరిస్తాం.

సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుందాం..!

నలుగురిలో ఒకరు మన దేశంలోనే...

ప్రపంచ మహిళా జనాభాలో 16 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు మన దేశంలోనే ఉండటం గమనార్హం. ఇక, ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్న వారిలో మూడో వంతు మంది భారతీయ మహిళలే. తాజా గణాంకాల ప్రకారం ఏటా దేశంలో 80 వేల మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 35 వేల మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని