Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!

గుజరాత్‌లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా చనిపోయిన 1052 మందిలో 80శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు.

Published : 02 Dec 2023 02:10 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా 1052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 80శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసు వారేనని తెలిపింది. ఇలా గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో సీపీఆర్‌(CPR)పై దాదాపు 2లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

‘గుండెపోటుతో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 80శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసువారే. ఈ విద్యార్థులు, యువకులకు ఊబకాయులు కూడా కాదు. హృదయ సంబంధిత కారణాలతో రోజుకు సగటున 173 ఎమర్జెన్సీ కాల్స్‌ ఎమర్జెన్సీ విభాగానికి వస్తున్నాయి’ అని గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి కుబేర్‌ డిండోర్‌ వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువగా చిన్నవయసు వారే ఉండటంతో గుండెపోటుపై యువకుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

‘గుండె’ జర భద్రం!

క్రికెట్‌ ఆడుతుండగా, గార్బా నృత్యం చేస్తున్న సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ఉపాధ్యాయులందరూ భాగస్వామ్యం కావాలని సూచించిన ఆయన.. తద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశామని, దాదాపు రెండు లక్షల మంది టీచర్లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో 2500 మంది వైద్య నిపుణులు పాల్గొంటారని గుజరాత్‌ మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని