Adhir Ranjan Chowdhury: ‘ఇకపై నాకంతా కష్టకాలమే’.. ఓటమిపై అధీర్‌ చౌధరి

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేశారు. సొంతంగా ఇల్లు, మరే ఇతర ఆదాయాలు లేకపోవడంతో రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటానని ఆవేదన వ్యక్తంచేశారు.

Updated : 06 Jun 2024 15:25 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ (Congress) నేత అధీర్‌ రంజన్‌ చౌధరి (Adhir Ranjan Chowdhury) లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన బహరంపుర్‌ నియోజకవర్గానికి ఆయన పాతికేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఈ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత యూసఫ్‌ పఠాన్‌ చేతిలో 85 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.  ఓటమిపై స్పందించిన అధీర్‌.. తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేశారు.

‘‘ఇకపై రాబోయే కాలమంతా నాకు కష్టకాలమే. తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటానని అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. రాజకీయాల్లో తప్ప మరే ఇతర విషయాల్లో నాకు నైపుణ్యాలు లేవు. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతో పోరాటం చేశా. కానీ, నా కుటుంబ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆదాయ వనరులను ఏర్పాటుచేసుకోలేదు. రాబోయే రోజుల్లో వచ్చే కష్టాలను ఎలా అధిగమించాలో తెలియడం లేదు’’ అని అధీర్‌ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత స్థలం కూడా లేదు..

కొన్నేళ్లుగా రాష్ట్రంలో కీలక నేతగా వ్యవహరించిన అధీర్‌ ఓటమి అనంతరం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సివస్తోంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంతవరకు ఈ ప్రాంతంలో నాకు సొంత స్థలం కూడా లేదు. ప్రస్తుతం నా కూతురు చదువు కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంలోనే మరో ప్రత్యమ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంది’’ అని అన్నారు.

మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి విదేశీ నేతలు

పదవిని వద్దనుకున్నా కానీ..

ఎంపీగా వ్యవహరిస్తున్న సమయంలో తాను ఆ పదవిని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధీర్‌ తెలిపారు. నాడు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కోరిక మేరకే కొనసాగించానని అన్నారు. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ నాయకుల నుంచి ఇప్పటివరకు తనకు కనీసం ఫోన్‌ కూడా రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమికి మమతా బెనర్జీ సన్నిహితంగా ఉండటంపై మాట్లాడుతూ.. విపక్ష కూటమిలో టీఎంసీ ఉండడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. అయితే, దీదీతో పొత్తును మాత్రం పార్టీ హైకమాండ్‌ ముందు వ్యతిరేకించిన మాట వాస్తవేనన్నారు.

‘‘మీకు (టీఎంసీని ఉద్దేశిస్తూ) వ్యతిరేకంగా మాట్లాడినందుకు నన్ను శిక్షించండి. అంతేకానీ, మా కార్యకర్తలను ఇబ్బందులను గురిచేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దయచేసి అలా చేయకండి’’ అని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు