Swati Maliwal: అతడు నా ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్‌

Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనను దారుణంగా కొట్టాడని ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Updated : 17 May 2024 13:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal PA Bibhav Kumar) దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆప్‌ (AAP) ఎంపీ ఆరోపించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

దిల్లీ పోలీసు బృందం గురువారం మాలీవాల్‌ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా దాడి  (Assault) ఘటనను ఎంపీ పోలీసులకు వివరించారు. ‘‘సీఎం (Arvind Kejriwal) నివాసంలో కూర్చున్న నా వద్దకు బిభవ్‌ వచ్చి దాడికి దిగాడు. 7-8 సార్లు చెంపపై కొట్టాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిచా. నన్ను నేను రక్షించుకునేందుకు అతడిని నా కాళ్లతో బలంగా తోసేశా. పరిగెడుతుంటే నా చొక్క పట్టుకుని వెనక్కి లాగాడు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా’’ అని స్వాతి వెల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

స్వాతి ముఖంపై గాయాలు..

దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 13న కేజ్రీవాల్‌ నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై స్వాతి (Swati Maliwal) గురువారం తొలిసారిగా స్పందించారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని భాజపాకు విజ్ఞప్తి చేశారు.

ఆప్‌లో ఇలాంటి దాడులు సాధారణమే..

స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో ఆప్‌ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు. ‘‘స్వాతిపై దాడి జరిగింది. కేజ్రీవాల్‌ చెప్పింది చేయడమే బిభవ్‌ పని. ఆ వ్యక్తి దురుసు ప్రవర్తనను నేనూ సహించాల్సి వచ్చింది. అక్కడ కొట్టడం మామూలే. ప్రశాంత్‌ కుమార్‌, యోగేంద్ర యాదవ్‌ లాంటి వాళ్లను బౌన్సర్లలతో గెంటేశారు. ఈ సారి హద్దులు దాటారు. పీఏతో ఓ మహిళను కొట్టంచడం తగినదేనా? ఇంత జరిగాక కేజ్రీవాల్‌ సీఎం పదవిలో కొనసాగడం సరికాదు. ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని