Heatstroke: ఉత్తరాదికి ఎండదెబ్బ.. ఒక్క రోజులో 50 మంది మృతి

ఉత్తరాదిన నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో గత 24 గంటల్లోనే 50 మందికి పైగా చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.

Published : 31 May 2024 19:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. వారం రోజులుగా ఉత్తరాదిన 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దిల్లీ, రాజస్థాన్‌, బిహార్‌, యూపీతోపాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వడదెబ్బల ధాటికి అనేకమంది పిట్టల్లా రాలిపోతున్నారు. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 50 మందికి పైగా చనిపోయినట్లు అంచనా. బిహార్‌లో ఒక్కరోజులో 14 మంది చనిపోగా.. అందులో పది మంది పోలింగ్‌ సిబ్బంది ఉన్నారు. రాజస్థాన్‌లోనూ పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య 100 దాటిందని విపక్షాలు, నిపుణులు ఆరోపిస్తున్నారు.

బిహార్‌లో అనేకచోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బక్సర్‌లో గురువారం 47.1 డిగ్రీలు నమోదయ్యింది. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలోనే 14 మంది చనిపోయినట్లు అక్కడి విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వీరిలో 10 మంది పోలింగ్‌ సిబ్బంది ఉన్నారని తెలిపింది. అయితే, వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 30కిపైగా ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

మహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్‌ అరెస్టు.. ఎందుకంటే!

ఒడిశాలోనూ ఈ మరణాలు నమోదవుతున్నాయి. రావుర్కెలాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 నుంచి 12 మంది చనిపోయినట్లు సమాచారం. దాదాపు 50 మంది బాధితుల్లో ఎనిమిది మంది ఆసుపత్రికి వచ్చేసరికే ప్రాణాలు కోల్పోయారని, మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మరణాలకు గల కారణాలు తెలుస్తాయన్నారు.

దేశ రాజధాని దిల్లీలో పలుచోట్ల 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా బుధవారం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఝార్ఖండ్‌లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, యూపీలో ఇద్దరు చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

రాజస్థాన్‌లో అనేకచోట్ల 50 నుంచి 52 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అనేక జిల్లాలకు ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ వేసవి సీజన్‌లో వడదెబ్బ కారణంగా దాదాపు 122 మంది చనిపోయినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 61 మంది గత వారం రోజుల వ్యవధిలోనే మరణించినట్లు అంచనా. అయితే, వీటిలో ఎక్కువభాగం మరణాలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం లేదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పరిహారం చెల్లించకుండా తప్పించుకునేందుకే వీటిని దాచిపెడుతోందని మండిపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు