Prajwal Revanna: మహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్‌ అరెస్టు.. ఎందుకంటే!

అనేక మంది మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను మహిళా పోలీసు బృందమే అరెస్టు చేసింది.

Updated : 31 May 2024 17:55 IST

బెంగళూరు: అనేకమంది మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసు బృందమే ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. ఇద్దరు మహిళా ఐపీఎస్‌ అధికారిణులు దీనికి నేతృత్వం వహించారు.

జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్‌కు మహిళా పోలీసులు దర్శనమిచ్చారు. అనంతరం ఆయన్ను చుట్టుముట్టారు. అరెస్టు వారెంటు చూపించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి సీఐడీ కార్యాలయానికి తరలించే క్రమంలోనూ.. ఆ జీపులో మహిళా పోలీసు అధికారిణులే ఉన్నారు. ఐపీఎస్‌లు సుమన్‌ డీ పెన్నేకర్‌, సీమా లాట్కర్‌ల నేతృత్వంలో అరెస్టు జరిగింది.

‘జూన్‌ 2న లొంగిపోతా.. నా తల్లిదండ్రులు జాగ్రత్త’: కేజ్రీవాల్‌ ఉద్వేగం

‘‘ప్రజ్వల్‌ను అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అధికారులనే పంపాలని నిర్ణయించాం. ఎంపీ పదవిని, పలుకుబడిని అడ్డంపెట్టుకొని మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయన్ను అరెస్టు చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాం’’ అని సిట్‌ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మహిళా అధికారులు ఎవరికీ భయపడరనే సందేశాన్నీ బాధిత మహిళలకు ఇవ్వడం ద్వారా వారికి భరోసా కలిగించడమే తమ ఉద్దేశం అన్నారు.

తల్లినీ ప్రశ్నించనున్న సిట్‌..

ప్రజ్వల్‌ అరెస్టులో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు.. ఆయన తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు సిద్ధమయ్యారు. బాధితురాలి కిడ్నాప్‌ కేసులో భాగంగా జూన్‌ 1న విచారించనున్నట్లు ఆమెకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. మహిళా పోలీసుల సమక్షంలోనే విచారణ ఉంటుందని.. ఇందుకోసం శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఓ మహిళను కిడ్నాప్‌ చేసిన కేసులో భవానీ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధిత మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్‌ కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఆమెను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. అయితే, ముందస్తు బెయిల్‌ కోసం ప్రజ్వల్‌, భవానీలు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని