Rajouri Encounter: రెండో రోజూ కాల్పుల మోత! పాకిస్థానీ ‘కీలక’ ఉగ్రవాది హతం

జమ్మూ- కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన కీలక ఉగ్రవాది హతమయ్యాడు.

Published : 23 Nov 2023 14:22 IST

రాజౌరీ: జమ్మూ-కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ (Rajouri Encounter)లో నలుగురు సైనికులు వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఇదే ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక ఉగ్రవాదీ హతమయ్యాడు. అతడిని క్వారీగా గుర్తించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. లష్కరే తోయిబా (Let)లో అతడు ఉన్నత స్థాయి ఉగ్రనేత అని, పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని తెలిపాయి. మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌ రెండో రోజూ కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

‘పాకిస్థాన్‌కు చెందిన క్వారీ.. పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉగ్ర శిక్షణ పొందాడు. లష్కరే తోయిబా (LeT)లో హై ర్యాంకు కలిగిన నాయకుడు. గత ఏడాది కాలంగా తన బృందంతో కలిసి రాజౌరీ- పూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడే! ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు అతడిని పంపారు. అతడు పేలుడు పదార్థాల తయారీతోపాటు గుహల్లో నక్కి ఉగ్రకార్యకలాపాలు నిర్వహించడంలో నిపుణుడు. శిక్షణ పొందిన స్నైపర్‌ కూడా’ అని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రపుట్టగా పీర్‌ పంజాల్‌.. రోజుల తరబడి ఎన్‌కౌంటర్లు..!

ఇదిలా ఉండగా.. రాజౌరీలోని కాలాకోట్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు, ఒక హవల్దార్‌, ఒక జవాను వీరమరణం పొందారు. మరో మేజర్‌, జవాను గాయపడ్డారు. బాజిమాల్‌ ప్రాంతంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక, పోలీసు బలగాలు ఉమ్మడిగా రంగంలోకి దిగడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రివేళ నిలిచిపోయిన ఈ ఎన్‌కౌంటర్‌ నేడు మళ్లీ ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని