Pir Panjal: ఉగ్రపుట్టగా పీర్‌ పంజాల్‌.. రోజుల తరబడి ఎన్‌కౌంటర్లు..!

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో మొదలైన ఎన్‌కౌంటర్‌ రోజులు గడుస్తు్న్నా ఆగడంలేదు. దుర్భేద్యమైన పీర్‌పంజాల్‌ పర్వతాల్లో ముష్కరులు నక్కి దళాలపై దాడులు చేస్తున్నారు.  

Published : 15 Sep 2023 15:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని పీర్‌ పంజాల్‌ (Pir Panjal) పర్వత శ్రేణులు.. ఉగ్రనాగులకు ఆవాసంగా మారాయి. గతంలో పాక్‌ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు నక్కాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో ఒక కర్నల్‌, మేజర్‌, కశ్మీరీ పోలీసు డీఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ జిల్లా నార్లా గ్రామంలో చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ రోజులు గడుస్తున్నా ముగింపునకు రాలేదు. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.

వాస్తవానికి మంగళవారం ఇక్కడ ఉగ్రకదలికలు తెలుసుకొని రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. లష్కరే కమాండర్‌ ఉజైర్‌ ఖాన్‌ వీరిలో ఉన్నాడని నమ్ముతున్నారు. ఇతడు స్థానిక ఉగ్రవాది. కానీ, రాత్రి కావడంతో ఇవి కొంత నెమ్మదించాయి. దీంతో ఉగ్రవాదులు ఇక్కడి పర్వతశ్రేణుల్లోని పైభాగానికి చేరుకొని నక్కారు. బుధవారం ఉదయం ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టిన సమయంలో వారు అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఈ ఘటనలు మొత్తం పీర్‌ పంజాల్‌ రేంజ్‌లో పెరిగిన ఉగ్ర కదలికలను తెలియజేస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రమూకను మట్టుబెట్టేందుకు అధికారులు డ్రోన్లు, ఐఈడీలను వాడాల్సి వస్తోంది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో.. ఉగ్రవాదులకు చైనా ఆయుధాలు..!

ఈ రేంజ్‌ ఎందుకు కీలకం..

పీర్‌పంజాల్‌ రేంజిల్‌లోని పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. పాక్‌ నుంచి సరిహద్దు దాటుకొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు శ్రీనగర్‌ లేదా డోడా వెళ్లాలన్నా అనంతనాగ్‌ మీదుగానే ప్రయణించాలి. దీంతో ఉగ్రవాదులకు ఇది ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్‌ పంజాల్‌ పర్వశ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడున్న బనిహాల్‌, హాజిపీర్‌, పీర్‌పంజాల్‌ పాస్‌లు అత్యంత కీలకమైనవి.

ఇక్కడి దాదాపు 15 వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వశ్రేణుల భౌగోళిక స్వరూపం సైనిక అపరేషన్లకు ఏ మాత్రం అనుకూలించదు. ఇక్కడి పరిస్థితి అఫ్గానిస్థాన్‌లోని పర్వత శ్రేణుల్లా ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతారు. దీనికి చిక్కటి అడవులు తోడు కావడంతో ఎంత పెద్ద దళానికైనా.. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోవాలన్నా భారీగా శ్రమించాల్సి వస్తుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా అత్యంత సమీపంలోనే ఉంటుంది.

ఆపరేషన్‌ సర్పవినాశ్‌ ఈ రేంజిలోనే.. 

2003లో ఆపరేషన్‌ సర్పవినాశ్‌ చేపట్టగా.. పూంచ్ నుంచి పీర్‌పంజాల్‌ పర్వత ప్రాంతంలో భారీగా ఉగ్రస్థావరాలు ఏర్పాటు చేసుకొన్నట్లు గుర్తించారు. అప్పట్లో హిల్‌కాకా ప్రాంతంలో వందల సంఖ్యలో ఉగ్రస్థావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. వాస్తవానికి ఇక్కడి వేసవిలో గొర్రెలను కాచుకొనే తెగకు చెందిన వారు నిర్మించుకొన్న డోకే అనే నిర్మాణాలు ఉగ్రమూకకు బాగా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఉగ్ర ఆపరేషన్లు పెరిగిపోయాయి. రాజౌరీ వద్ద చొరబాట్లను అడ్డుకోవడానికి సైన్యం దాదాపు 100 కిలోమీట్లరకు పైగా ఫెన్సింగ్‌ వేసింది. కానీ, హిమపాతం ఫెన్సింగ్‌ను ముంచేస్తుంది. దీనికి తోడు భౌగోళిక పరిస్థితులు కూడా ఉగ్రవాదుల చొరబాట్లకు అనుకూలిస్తున్నాయి.

సిమ్‌లు వినియోగించరు.. స్థావరాలు మార్చేస్తుంటారు..

ఇటీవల కాలంలో సైనిక దళాలు ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రాక్‌ చేస్తున్నాయి. దీంతో ఉగ్రవాదులు సాంకేతికత విషయంలో కొత్త ఎత్తులు వేస్తున్నారు. గతంలో టెర్రరిస్టులు ఒక ఇంట్లో స్థిరంగా ఆశ్రయం పొందేవారు. ఇప్పుడు తరచూ తమ స్థావరాలను మార్చేస్తున్నారు. దీంతో వారిని వేటాడం దళాలకు కష్టంగా మారింది. అదే సమయంలో కొత్త స్థావరాల్లో  ఉగ్రమూక ముందే పొజిషన్లు తీసుకొని సిద్ధంగా ఉండటంతో భద్రతా దళాలు ఎక్కువ ప్రాణనష్టం చవిచూస్తున్నాయి. అనంత్‌నాగ్‌లో కూడా ఉగ్రవాదులు ఇంట్లో కాకుండా అడవుల్లో ఆశ్రయం పొందారు. 

మరోవైపు వైఎస్‌ఎంఎస్‌ (YSMS) టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. 2016, 2019లో జరిగిన భారీ ఉగ్రదాడుల్లో కూడా దీన్ని వాడారు. ఈ టెక్నాలజీలో వెరీ హైఫ్రీక్వెన్సీలో ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను పంపడంతో వీటిని ట్రాక్‌ చేయడం దళాలకు కష్టంగా మారింది. స్మార్ట్‌ఫోన్లను రేడియో సెట్లకు అనుసంధానించి అత్యవసర సందేశాలు పంపడం, తమ లొకేషన్లను ఉగ్రబాస్‌లకు చేరవేయడం చేస్తున్నారు.

కేరళలో నిఫా కలవరం.. మరో వ్యక్తికి పాజిటివ్‌

దీనికి తోడు స్థానికులను బెదిరించి వారి ఫోన్ల నుంచి ప్రత్యేక యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసి వాటి నుంచి సమాచారాన్ని పాక్‌కు సమాచారం అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలను కూడా పంపుతున్నారు. పీర్‌ పంజాల్‌ ప్రాంతంలో పాక్‌ సెల్యూలర్‌ సర్వీసుల సిగ్నల్స్‌ కూడా బలంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదులతో రోజుల తరబడి పోరాడాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని