Nitish Kumar: నీతీశ్‌ రూట్‌ మారనుందా..? మోదీని కొనియాడి, ‘ఇండియా’ పార్టీలకు చురకలు

విపక్ష ‘ఇండియా’ కూటమిలో భిన్న గళాలు వినిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌(Nitish Kumar) మాటలు కూడా కూటమిలోని భేదాభిప్రాయాలను వెల్లడి చేస్తున్నాయి. 

Updated : 25 Jan 2024 16:12 IST

పట్నా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్‌(Congress)కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రాల్లో తాము ఒంటరిగానే పోరాడతామంటూ టీఎంసీ, ఆప్‌ ప్రకటించిన తరుణంలోనే విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన నీతీశ్‌ కుమార్(Nitish Kumar).. హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌ (Karpoori Thakur) శతజయంతి వేడుకలో మాట్లాడుతూ మోదీ(Modi)ని ప్రశంసించారు.

బిహార్‌ (Bihar) రాష్ట్రంలో ‘జన నాయక్‌’గా ప్రసిద్ధి పొందిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరీ ఠాకుర్‌ (Karpoori Thakur)కు మోదీ సర్కార్‌ భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నీతీశ్‌ మాట్లాడుతూ.. ‘2005లో నేను అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఈ భారతరత్న గురించి కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నోమార్లు అభ్యర్థన చేశాను. చివరకు ప్రస్తుత ప్రభుత్వం ఆ పురస్కారం ఇచ్చింది. దీనిపై ప్రధాని నుంచి ఫోన్ వచ్చిందని ఠాకుర్‌ కుమారుడు నాకు చెప్పారు. ప్రధాని నుంచి నాకు ఎలాంటి కాల్‌ రాలేదు. అయినా సరే, కేంద్రం.. మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ మీరు తీసుకోవచ్చని నేను ఆయనకు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు.

ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుంది: దీదీ ప్రకటన వేళ రాహుల్ వ్యాఖ్యలు

అలాగే వారసత్వ రాజకీయాలను ఖండించారు. ‘రాజకీయాల్లో తమ వారసులకు అధికారం కట్టబెట్టడంపై చాలామంది దృష్టి సారించారు. కానీ కర్పూరీజీ ఎప్పుడూ అలా చేయలేదు. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన నేను.. నా కుటుంబాన్ని దూరంగా ఉంచాను. పార్టీలో ఇతర నేతలను ప్రోత్సహించడం పైనే నేను ఎక్కువ దృష్టి సారించాను’ అని కాంగ్రెస్‌, లాలూప్రసాద్‌ యాదవ్ పార్టీ ఆర్జేడీ(RJD)ని ఉద్దేశించి విమర్శలు చేశారు. కర్పూరీకి భారతరత్న ఇవ్వడంపై యూపీఏ ప్రభుత్వానికి ఎన్నో అభ్యర్థనలు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు.

ఇదిలాఉంటే.. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కానీ ఈ శతజయంతి వేడుకలను మాత్రం విడివిడిగా నిర్వహించడం గమనార్హం. ఇదే సమయంలో, సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. కాసేపటికే దాన్ని డిలీట్‌ చేయడం గమనార్హం. దీంతో జేడీయూ, ఆర్జేడీ మధ్య చీలికలు ఏర్పడినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ కూటమి నుంచి నీతీశ్ విడిపోయి.. మళ్లీ భాజపాతో జట్టుకట్టే సంకేతాలు కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని