Ayodhya: జనవరిలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ.. హోటళ్లకు ముందస్తు బుకింగ్‌ తాకిడి!

వచ్చే జనవరి నాటికి ఆలయంలో (Ayodhya) విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు చేస్తున్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరం, చుట్టుపక్కల ప్రదేశాల్లోని హోటళ్లకు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ తాకిడి పెరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Published : 20 Jul 2023 20:41 IST

అయోధ్య: ఎన్నో ఏళ్లుగా యావత్‌ భారత ప్రజలు ఎదురుచూస్తోన్న అయోధ్య రామ మందిరం (Ram Mandir) మరికొన్ని రోజుల్లోనే భక్తులకు దర్శనం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భూ అంతస్తు (Ground Floor) నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా.. వచ్చే జనవరి నాటికి ఆలయంలో (Ayodhya) విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గడువు సమీపిస్తున్న వేళ.. వాటిని చూసేందుకు భక్తులు కూడా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరం, చుట్టుపక్కల ప్రదేశాల్లోని హోటళ్లకు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ తాకిడి మొదలైందని నిర్వాహకులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ To అయోధ్య, వారణాసి టూర్‌.. IRCTC ప్యాకేజీ వివరాలు..

అయోధ్య రామమందిరంలో 2024 జనవరి మూడో వారంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇటీవల పేర్కొంది. ముఖ్యంగా జనవరి 22న శ్రీరామచంద్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తైన తర్వాత ఆలయ దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో అక్కడి హోటళ్లు, రిసార్టులకు ఇప్పటినుంచే ముందస్తు బుకింగ్‌లు అవుతున్నాయట. దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు సాగే ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులతో ఆయోధ్య నగర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.

ఫైజాబాద్‌లో దాదాపు 150 హోటళ్లు ఉండగా.. అయోధ్యలో 10 లగ్జరీ, 25 బడ్జెట్‌, 115 ఎకానమీ హోటళ్లు ఉన్నాయి. వీటితోపాటు 35 గుర్తింపు పొందని గెస్ట్‌హౌస్‌లు, 50 ధర్మశాలలు, 50 పేయింగ్‌ గెస్ట్‌ హౌస్‌లు కలిపి జిల్లాలో మొత్తంగా 10వేల రూమ్‌లు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆతిథ్యం ఇవ్వడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను హోటళ్ల యాజమాన్యాలను సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని