అమెరికాలో హ్యారీ-మేఘన్‌.. ఆదాయం ఎలా?

అమెరికన్ యాంకర్‌ ఓప్రా విన్‌ఫ్రే టీవీషోకు బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ.. మేఘన్‌ మార్కెల్‌ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్‌ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మేఘన్‌కు ఎన్నో ఇబ్బందులు

Updated : 11 Mar 2021 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికన్ యాంకర్‌ ఓప్రా విన్‌ఫ్రే టీవీషోకు బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ.. మేఘన్‌ మార్కెల్‌ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్‌ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మేఘన్‌కు ఎన్నో ఇబ్బందులు ఏర్పడటం.. కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలు హ్యారీకి కూడా నచ్చకపోవడంతో ఇద్దరు కలిసి ప్యాలెస్‌తోపాటు, రాజకుటుంబాన్ని వీడి బయటకు వచ్చేశారు. మేఘన్‌ స్వస్థలం యూఎస్‌లోని కాలిఫోర్నియాకి వచ్చి స్థిరపడ్డారు. హ్యారీ తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహించిన బ్రిటన్‌ రాజకుటుంబం అతడి ఖర్చులకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేసింది. దీంతో తన తల్లి ప్రిన్సెస్‌ డయానా నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బుతోనే తన ఆర్థిక అవసరాలు తీరుతున్నాయని హ్యారీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, డయానా నుంచి హ్యారీకి ఎంతమొత్తంలో నగదు అందింది? అమెరికాలోని కాలిఫోర్నియాలాంటి ప్రధాన రాష్ట్రంలో హ్యారీ కుటుంబం జీవించడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? వంటి ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికలు వాటిపై ఆరా తీసి.. సమాధానం కనిపెట్టాయి. అదేంటంటే..

అంతర్జాతీయ మీడియా అంచనా ప్రకారం.. ప్రిన్స్‌ హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా 10 మిలియన్‌ పౌండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రిన్స్‌ హ్యారీ పేరు మీద డయానా 8.9మిలియన్‌ పౌండ్లు మాత్రమే దాచిపెట్టారట. దానిపై వచ్చిన వడ్డీ.. ఇతర ఆదాయం కలిపి మొత్తం 10 మిలియన్‌ పౌండ్లు అయినట్లు మీడియా పేర్కొంది. ఆమె పెద్దకుమారుడు.. హ్యారీ సోదరుడు విలియమ్‌కు కూడా డయానా 9 మిలియన్‌ పౌండ్లు వదిలివెళ్లారట. 

డయానా వివాహం.. విడాకులు.. భరణం

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌తో డయానాకు 1981లో వివాహమైంది. బ్రిటన్‌లో ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె.. చార్లెస్‌తో వివాహంతో బ్రిటన్‌ రాజకుటుంబంలో సభ్యురాలిగా మారారు. వారి వివాహబంధానికి గుర్తుగా ప్రిన్స్‌ విలియమ్స్‌.. ప్రిన్స్‌ హ్యారీలు జన్మించారు. కానీ, డయానా దంపతుల దాంపత్య జీవితం అంత సఖ్యంగా ఉండేది కాదు. పలు అంశాల్లో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 1996లో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డయానాకు భరణం కింద 17 మిలియన్‌ పౌండ్లు, జీవన భృతి కింద ఏటా 4లక్షల పౌండ్లు అందేలా ఒప్పందం కుదిరింది. కానీ, విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది అంటే 1997లో కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకుముందే భరణం కింద వచ్చిన డబ్బును డయానా తన ఇద్దరు పిల్లల పేరుమీద దాచిపెట్టారు. వారిద్దరికి పాతికేళ్లు వచ్చాక ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ వచ్చేలా.. 30 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలా 36ఏళ్ల హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బే అమెరికాలో స్థిరపడటానికి ఉపయోగపడింది.

మేఘన్‌ వృత్తి.. ఒప్పందాలు

ప్రిన్స్‌ హ్యారీతో వివాహానికి ముందు మేఘన్‌ అనేక టీవీ సిరీస్‌లు.. పలు సినిమాల్లో నటించింది. సూట్స్‌ అనే సిరీస్‌లో మేఘన్‌ ఒక ఎపిసోడ్‌కు 50వేల డాలర్లు పారితోషికంగా తీసుకుందట. అలాగే, పలు బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా, స్పాన్సర్‌షిప్‌ కింద ఏటా 80వేల డాలర్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ దాదాపు 2 మిలియన్‌ డాలర్లు ఉంటుందట. ఇద్దరి డబ్బులతో కాలిఫోర్నియాలో 14.65 మిలియన్‌ డాలర్లు పెట్టి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాదు, ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నెట్‌ఫ్లిక్స్‌, స్పూటిఫైలతో హ్యారీ, మేఘన్‌ మిలియన్‌ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కుటుంబ పోషణ కోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నామని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్యారీ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు