భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్‌ పతకం విజేత విజేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 00:09 IST

దిల్లీ: ఒలింపిక్‌ పతకం విజేత విజేందర్‌ సింగ్‌ ఇటీవల కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని అన్నారు. దీన్ని అంగీకరించడానికి తనకు ఎటువంటి సంకోచం లేదని.. ఇందుకు తనవద్ద కారణాలూ ఉన్నాయన్నారు. భాజపాలో చేరిక తర్వాత తొలిసారి స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొందరు ఆప్తమిత్రులకు దూరమయ్యానని అన్నారు.

‘నేను కేవలం వేదికను మార్చాను తప్ప నేను మాత్రం మారలేదు. ఎప్పటిలాగే ఉన్నా. బాక్సింగ్‌లో వెయిట్‌ కేటగిరీ మార్చినప్పుడు కలిగే ఇబ్బంది మాదిరిగానే.. రాజకీయాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సర్దుకుపోవడం కష్టంగా అనిపించి వేదికను మార్చుకున్నా. యువత శ్రేయస్సు, దేశం కోసం భాజపాలో చేరా. నా నిర్ణయం కొందరికి షాక్‌కు గురిచేసింది. పంజాబ్‌, హరియాణా, యూపీలో నా సన్నిహితులు కలత చెందారు. ఆప్త మిత్రులకు దూరమయ్యా. ఈక్రమంలో భావోద్వేగం సహజంగానే ఉంటుంది. మళ్లీ వాళ్లకు దగ్గరవుతాననే విశ్వాసం ఉంది’ అని విజేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

బాక్సింగ్‌లో భారత్‌ తరఫున తొలి ఒలింపిక్‌ పతకం సాధించిన విజేందర్‌.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నుంచి హస్తం అభ్యర్థిగా పోటీ చేసి భాజపా నేత రమేశ్‌ బిధూరీ చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది అప్పటి భారత రెజ్లింగ్‌ సమాఖ్య బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు విజేందర్‌ మద్దతిచ్చారు. వారితో పాటు ఆందోళనలోను పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని