Ashok Gehlot: సీఎం పదవి వద్దనుకున్నా.. ఆ పదవే నన్ను వదలడం లేదు!

ముఖ్యమంత్రి పదవిని తాను వదిలిపెట్టాలని భావించినప్పటికీ.. ఆ పదవే తనను వదలడం లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు.

Published : 08 Aug 2023 01:52 IST

జైపుర్‌: రాజస్థాన్‌లో (Rajasthan Assembly) క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో (2018) కాంగ్రెస్‌ విజయం సాధించినప్పటి నుంచి ముఖ్యమంత్రి పీఠం (CM Post)పై అగ్రనేతల మధ్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. త్వరలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ‘పదవి’పై మాత్రం పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని తాను వదిలిపెట్టాలని భావించినప్పటికీ.. ఆ పదవే తనను వదలడం లేదంటూ వ్యాఖ్యానించారు. సీఎం పదవిపై గహ్లోత్‌ ఇటీవల ఇలా మాట్లాడటం రెండోసారి కావడం గమనార్హం.

‘ఈ పదవిని వదిలేయాలని నా మనసులో ఉంది. ఎందుకు వదిలేయాలన్నది మాత్రం మిస్టరీనే. కానీ, ఈ పదవే నన్ను వీడటం లేదు. అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. సీఎం పదవిని వదిలేస్తా అని చెప్పడానికి ధైర్యం ఉండాలి.. కానీ, అదే నన్ను వదలడం లేదు. తనను ముఖ్యమంత్రిగా మూడుసార్లు సోనియా గాంధీ ఎంపిక చేయడం సామాన్య విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే.. విజన్‌ 2030ని అమలు చేస్తాం. తాను ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే రాజస్థాన్‌ బలమైన రాష్ట్రంగా ఎదిగింది’ అని జైపుర్‌లో జరిగిన కొత్త జిల్లాల వ్యవస్థాపక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు.

మణిపుర్‌ హింస.. మహిళా మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు

ఇదిలాఉంటే, మరికొన్ని నెలల్లోనే రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉంటారనే విషయంపై పార్టీలో చర్చ మొదలయ్యింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల ఓ మహిళా కార్యకర్త.. మీరే సీఎంగా ఉండాలని గహ్లోత్‌తో అన్నారు. దీనిపై స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని భావించినా అదే నన్ను వీడటం లేదన్నారు. తాజాగా మరోసారి ఇదేవిధంగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని