Supreme Court: మణిపుర్‌ హింస.. మహిళా మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు

మణిపుర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి.. ప్రభావితమైన వారికి సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు మాజీ మహిళా న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది.

Updated : 07 Aug 2023 19:55 IST

దిల్లీ: మణిపుర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది.  బాధితులకు సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మహిళా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది. జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో జస్టిస్‌ (రిటైర్డ్‌) షాలినీ పీ జోషి, జస్టిస్‌ ఆశా మేనన్‌లు ఉంటారని పేర్కొంది. రాష్ట్రంలో చట్టబద్ధపాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

మణిపుర్‌ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరై గతవారం సుప్రీం ధర్మాసనం కోరిన నివేదికలను అందించారు. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్‌ సింగ్‌ కూడా ధర్మాసనం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో హింస, వాటి నివారణకు ఇప్పటివరకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను సుప్రీం ధర్మాసనానికి వివరించారు. హింసాత్మక ఘటనల దర్యాప్తునకు జిల్లా ఎస్పీల నేతృత్వంలో ఎస్‌ఐటీ (SIT)లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మణిపుర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, వాటి పర్యవేక్షణ కోసం పలు కీలక సూచనలు చేసింది. ‘మణిపుర్‌ మహిళలపై జరిగిన అమానుష ఘటనలో నమోదైన 11 ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తునకు సంబంధించి.. సీబీఐలోకి వివిధ రాష్ట్రాలకు చెందిన డిప్యూటీ ఎస్పీ స్థాయి ఐదుగురు అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకురావాలి. వీరంతా అక్కడి సీబీఐ అధికారుల పరిధిలోనే పనిచేయాలి. ఇలా సీబీఐ చేపట్టే దర్యాప్తు మొత్తం పర్యవేక్షణను మాజీ ఐపీఎస్‌ దత్తాత్రేయ పడ్‌సల్గీకర్‌ చూస్తారు. సీబీఐకి బదిలీ చేయని కేసులను 42 ప్రత్యేక బృందాలు (SIT) దర్యాప్తు చేస్తాయి. ఏడుగురు డీఐజీ ర్యాంక్‌ అధికారులు వీటన్నింటి దర్యాప్తులను పర్యవేక్షించాలి. వీరంతా మణిపుర్‌ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులే ఉండాలి’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, మహిళలపై జరిగిన వేధింపులపై సీబీఐ దర్యాప్తు చేస్తోన్న 11 ఎఫ్‌ఆర్‌లు కాకుండా అదనంగా నమోదైతే.. వాటిని ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో జిల్లా స్థాయి సిట్‌లు దర్యాప్తు చేస్తాయని సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని