Deepfake: డీప్‌ఫేక్‌ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం

Deepfake Photos: ఏఐతో సృష్టించిన డీప్‌ఫేక్‌ ఫొటోలను గుర్తించేందుకు కొన్ని టిప్స్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఓ ట్యుటోరియల్‌ వీడియోను విడుదల చేసింది

Updated : 21 May 2024 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సాంకేతిక యుగంలో మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో ఒకటైన కృత్రిమ మేధ (Artificial intelligence) అంతేస్థాయిలో ప్రమాదకరమైనది కూడా..! ఏఐతో ఎన్నో ప్రయోజనాలున్నా.. కొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు (Deepface Photos)ల వల్ల ఎన్నో రంగాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. మన దేశంలోనూ ఈ డీప్‌ఫేక్ వ్యాప్తి కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నకిలీలను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (PIB) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

ఎలాంటి టెక్నాలజీ అవసరం లేకుండా కేవలం చిన్న చిన్న అంశాలను ఉపయోగించి ఏఐతో సృష్టించే డీప్‌ఫేక్‌ ఫొటోల (AI Generated Images)ను గుర్తించొచ్చని చెబుతోంది. క్షుణ్ణంగా గమనిస్తే వాస్తవ దూరంగా ఉండే చిత్రాలు, వింత వింత లైటింగ్‌, నీడలు, చిత్రాల్లో అసమానతలు తదితర తప్పులను మనం గుర్తుపట్టొచ్చని తెలిపింది. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఒక్కో అంశాన్ని సునిశితంగా వివరించింది.

బోర్గ్‌ డ్రింకింగ్‌.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్‌!

ఉదాహరణకు.. ఏఐతో సృష్టించిన నకిలీ ఫొటోలో మనుషుల శరీర తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. లేదా చేతివేళ్లు, కాలి వేళ్లు అసహజంగా కన్పిస్తాయని వీడియోలో పేర్కొంది. ఇక, ఎడిట్‌ చేసే ఫొటోల్లో నీడలు తేడాగా ఉంటాయని తెలిపింది. వీటిని పరిశీలిస్తే ఏది వాస్తవమో, ఏది నకిలీనో కనిపెట్టొచ్చని సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల కొందరు సినీతారల డీప్‌ఫేక్‌ వీడియోలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం నకిలీలను అడ్డుకునేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై చట్టం తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు