Cyclone Michaung: కాస్త తేరుకున్న చెన్నై.. ఎయిర్‌పోర్టులో రాకపోకల పునరుద్ధరణ

Cyclone Michaung: తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లో మిగ్‌జాం తుపాను ప్రభావం కాస్త తగ్గింది. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు.

Updated : 05 Dec 2023 10:36 IST

చెన్నై: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో స్తంభించిన చెన్నై (Chennai) నగరం వరద ప్రభావం నుంచి కాస్త తేరుకుంటోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంలోని చాలా చోట్ల వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని అటు వాతావరణ శాఖ (IMD) కూడా అంచనా వేసింది. అయితే, తమిళనాడు (Tamil Nadu) ఉత్తర తీర ప్రాంతాలు, పుదుచ్చేరీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

ఏపీ తీరానికి తరుముకొస్తోన్న ‘మిగ్‌జాం’.. 90-110 కి.మీ వేగంతో ఈదురు గాలులు!

  • భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపై సోమవారం భారీగా నీరు నిలిచి విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో పాటు, రన్‌వేపై నీటిని అధికారులు తొలగించారు. దీంతో మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు.
  • సోమవారం ఉదయం నుంచి చెన్నైలో చోటుచేసుకున్న వర్ష సంబంధిత ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలి పలువురు గాయపడ్డారు.
  • వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. చెన్నైలో ఇంకా కొన్ని చోట్ల వరద నీరు నిలిచి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూవమ్‌ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. 
  • వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలు, ఆఫీసులకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు.
  • తమిళనాడులో వర్షాల కారణంగా చోటుచేసుకున్న మరణాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయా రాష్ట్రాల్లోని  కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరారు.
  • అటు మిగ్‌జాం తుపానుపై ఒడిశా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. గజపతి జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని