Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా, ఆప్‌ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడంతో తొలిసారిగా అసెంబ్లీలో వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

Published : 04 Dec 2023 17:47 IST

రాయ్‌పుర్‌: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈసారి అసెంబ్లీలో రాజవంశీయులకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా, ఆప్‌ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడమే ఇందుకు కారణం. వీరిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌ కూడా ఉండటం గమనార్హం.

2000లో ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగా.. అప్పటి నుంచి ఈ ఐదు పర్యాయాలు రాజవంశీయుల ప్రాతినిధ్యం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఏడుగురు రాజవంశీయులు పోటీ చేశారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌ తరఫున, ముగ్గురు భాజపా టికెట్‌పై, ఒకరు ఆప్‌ తరఫున బరిలో నిలిచారు. కానీ, పార్టీలకు అతీతంగా అనూహ్యంగా వీరందరూ ఓటమి చవిచూశారు.

సీఎం రేసులో ఉండి..

సర్గుజా రాజకుటుంబానికి చెందిన టి.ఎస్‌.సింగ్‌దేవ్‌ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌ తరఫున అంబికాపుర్‌ నుంచి పోటీ చేశారు. గత మూడు దఫాలూ ఇక్కడ సింగ్‌దేవ్‌దే విజయం. 2018 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి రేసులోనూ కొనసాగారు. కానీ, తాజా ఫలితాల్లో 94 ఓట్ల తేడాతో భాజపా ప్రత్యర్థి రాజేశ్‌ అగర్వాల్‌ చేతిలో ఓడిపోయారు. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని జర్గుజా డివిజన్‌లో ఉన్న 14 నియోజకవర్గాల్లో వీరి కుటుంబ ప్రభావం ఉండేది. 2018 ఎన్నికల్లో ఈ స్థానాలన్నీ కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా.. తాజా ఎన్నికల్లో వీటన్నింటినీ భాజపా తన ఖాతాలో వేసుకుంది.

Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్‌ ఫలితం అంతుపట్టడం లేదు!

సర్గుజా రాజకుటుంబ వారసుల్లో ఒకరైన అంబికాసింగ్‌ దేవ్‌ బైకుంఠపుర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ టికెట్‌పై మళ్లీ అక్కడి నుంచే బరిలో దిగిన ఆమె భాజపా నేత భైయాలాల్‌ రాజ్‌వాడే చేతిలో 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫుల్జాహర్‌లోని గోండ్‌ రాజకుటుంబానికి చెందిన మరోనేత దేవేంద్ర బహదూర్‌ సింగ్‌ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తన సిట్టింగ్‌ స్థానమైన బస్నా నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. అజిత్‌ జోగీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. భాజపా నేత సంపత్‌ అగర్వాల్‌ చేతిలో 36వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

భాజపాలోనూ..

భాజపా నుంచి బరిలో దిగిన ముగ్గురు రాజవంశీయులు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. జష్‌పుర్‌ సంస్థానాన్ని పరిపాలించిన జూదేవ్‌ రాజకుటుంబానికి చెందిన సంయోగితా సింగ్‌ గత ఎన్నికల్లో చంద్రాపుర్‌లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి రెండోసారి కూడా ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌కుమార్‌ యాదవ్‌ 15వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక భాజపా అగ్రనేత దిలీప్‌సింగ్‌ జూదేవ్‌ కుమారుడైన ప్రబల్‌ ప్రతాప్‌సింగ్‌ కూడా భాజపా అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలయ్యారు.

అంబాగఢ్‌ చౌకీ సంస్థానాన్ని పాలించిన నాగవంశీ గోండ్‌ రాజకుటుంబ వారసుడు సంజీవ్‌ షా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి భాజపా టికెట్‌పై మొహ్లా-మాన్‌పుర్‌ నుంచి పోటీ చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేతిలో 31 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక లొహారా రాజకుటుంబ వారసుడు ఖడ్గరాజ్‌ సింగ్‌ ఆప్‌ తరఫున కవర్ధా నియోజకవర్గం బరిలో నిలిచారు. కేవలం 6వేల పైచిలుకు ఓట్లను మాత్రమే సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఇలా వివిధ పార్టీల నుంచి ఏడుగురు రాజవంశీయులు పోటీ చేసినప్పటికీ.. అందరూ ఓటమి చవిచూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని