Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్‌ ఫలితం అంతుపట్టడం లేదు!

మూడు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని.. మధ్యప్రదేశ్‌లో మాత్రం ఏం జరిగిందో అనే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Published : 04 Dec 2023 14:38 IST

దిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. ఒక్కో రాష్ట్రంలో ఎన్నిక ఒక్కో విధంగా ఉంటుందని పేర్కొంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచినప్పుడు ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించలేదు కదా అని ప్రశ్నించింది. అయినప్పటికీ.. మూడు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని తెలిపింది. అయితే, మధ్యప్రదేశ్‌లో మాత్రం ఏం జరిగిందో అనే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గత 9 ఏళ్లుగా అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఓటమి నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోవాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందించింది.

‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దు’: కాంగ్రెస్‌కు మోదీ సూచన

‘ప్రతి ఎన్నిక విభిన్నమైనది. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించినప్పుడు.. ఇలా వ్యాఖ్యానించలేదు (మోదీని ఉద్దేశిస్తూ). తెలంగాణలో గెలిచినప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. అయినప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో ఏం జరిగిందో కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకుంటాం. నిజంగా చెప్పాలంటే.. మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందో మేమింకా అర్థం చేసుకోలేక పోతున్నాం’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. తాజా ఫలితాలపై తప్పకుండా విశ్లేషించుకుంటామన్నారు. 

ఓట్లశాతంలో తేడా స్వల్పమే..

మూడు రాష్ట్రాల్లో తాజా ఫలితాలు తమ అంచనాలకు దూరంగా ఉండటం, తమ పార్టీ పనితీరు నిరాశపరిచిన మాట వాస్తవమే అయినప్పటికీ ఓట్ల శాతంలో భాజపాకు ఎక్కువ దూరంలో లేమని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ (కమ్యూనికేషన్‌) జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పునరుజ్జీవనం, ఆశకు ఇదో కారణమని అన్నారు. ఈ సందర్భంగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, భాజపా సాధించిన ఓట్ల శాతాన్ని పోల్చి చూపించారు. ఛత్తీస్‌గఢ్‌లో భాజపా 46.3శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌ 42.4శాతం వచ్చింది. మధ్యప్రదేశ్‌లో భాజపాకు 48.6శాతం రాగా, కాంగ్రెస్‌కు 40.4శాతం, రాజస్థాన్‌లో భాజపా 41.7శాతం సాధించగా కాంగ్రెస్‌ 39.5శాతం సాధించిందని జైరాం రమేశ్‌ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు