Bangladesh MP: భారత్‌లో బంగ్లా ఎంపీ హత్య ఘటన.. ఆ బ్యాగుల్లో ఏముందో..?

భారత్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ (Bangladesh MP) మహమ్మద్‌ అనర్‌ కేసులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ సీసీటీవీ దృశ్యాల్లో రికార్డయిన బ్యాగులు కీలకంగా మారాయి.  

Updated : 23 May 2024 13:46 IST

కోల్‌కతా/ఢాకా: భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అజీమ్‌(Md. Anwarul Azim Anar ) దారుణ హత్య గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన అదృశ్యమై రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు మృతదేహం లభ్యం కాలేదు. అయితే దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.

బిధాన్‌నగర్, బైర్‌క్‌పుర్ పోలీసు బృందాలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్ బృందాలు ఎంపీ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగమయ్యాయి. ఈ క్రమంలో వారు బుధవారం కోల్‌కతాలోని టౌన్‌హాల్‌కు చేరుకోగా.. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. కానీ, మృతదేహం ఆచూకీ మాత్రం దొరకలేదు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో.. మే 13న ఆ నివాస సముదాయంలోకి అనర్‌తో పాటు ఇద్దరు పురుషులు, ఒక మహిళ ప్రవేశించారు. మే 13, మే 15న ఆ ముగ్గురు వేర్వేరు సమయాల్లో బయటకు వెళ్లిపోయారు. కానీ, ఎంపీ (Bangladesh MP) బయటకు వెళ్లినట్లు ఎక్కడా రికార్డు కాలేదని పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు పెద్ద బ్యాగుల్ని వెంట తీసుకెళ్లడం కనిపించిందని చెప్పారు. వాటిల్లో ఏమున్నాయో తెలియాల్సి ఉంది.

కోల్‌కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ!

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన మహమ్మద్‌ అనర్‌ మే 12న కోల్‌కతా శివారులో ఉన్న తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ నివాసంలో బస చేశారు. బిశ్వాస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. దిల్లీకి వెళ్లనున్నట్లు మే 13న అనర్‌ తనకు ఒక సందేశం పంపారన్నారు.  తాను దిల్లీకి చేరుకున్నానని, వీఐపీలతో ఉండటంతో మాట్లాడటం కుదరదని మే 15న మరో మెసేజ్‌ చేసినట్లు చెప్పారు. ఆ నేత కుమార్తె ముమ్తారిమ్ ఫిర్దౌస్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడికి ఇలాంటి సందేశాలే వచ్చాయన్నారు. ‘‘మే 16న ఎంపీ ఫోన్ నుంచి పీఏకు కాల్ వచ్చింది. ఆ సమయంలో లిఫ్ట్ చేయలేకపోవడంతో..వెంటనే కాల్‌ బ్యాక్ చేశారు. కానీ, అవతలివైపు నుంచి ఎలాంటి స్పందనరాలేదు. మే 17న అనర్ కుమార్తె నాకు ఫోన్ చేసింది. తర్వాత నేను ఫిర్యాదు చేశా’’ అని బిశ్వాస్‌ తెలిపారు. ఇక ఈ ఘటనలో ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారు మహమ్మద్‌తో పాటు భారత్‌కు వచ్చిఉంటారని, హత్య తర్వాత తిరిగి బంగ్లాకు వచ్చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. 

స్నేహితుడే రూ.5 కోట్ల సుపారీ..

ఎంపీ మర్డర్‌ మిస్టరీలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బెంగాల్‌ సీఐడీ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ‘‘ఈ హత్యకు ముందే ప్రణాళిక రచించారు. ఇందుకోసం ఆయన పాత స్నేహితుడు సుమారు రూ.5 కోట్లు వెచ్చించారు’’ అని అధికారులు తెలిపారు. ఆ మిత్రుడు అమెరికా పౌరుడని, కోల్‌కతాలో ఒక ఫ్లాట్ ఉందని చెప్పారు. ఆ ఇంటిని ఫొరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని