Congress: సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్‌’ ప్రచారం.. ఎందుకంటే!

ఎన్నికల వేళ.. రాజస్థాన్‌లోని బన్‌స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేపట్టింది.

Published : 24 Apr 2024 17:39 IST

జైపుర్‌: దేశంలో ఎన్నికలు కొనసాగుతున్నవేళ తమ అభ్యర్థుల తరఫున ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కానీ, రాజస్థాన్‌లో మాత్రం తమ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ (Congress) జోరుగా ప్రచారం చేస్తోంది. తమ అభ్యర్థికి ఓటు వేయొద్దంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టింది. ఇంతకీ హస్తం పార్టీ ఇలా చేయడానికి కారణమేమిటంటే..

రాజస్థాన్‌లోని బన్‌స్వారా- దుంగార్పూర్‌ నియోజకవర్గంలో ఎక్కువమంది గిరిజనులు నివసిస్తున్నారు. ఈ స్థానంలో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేసిన కాంగ్రెస్‌.. అరవింద్‌ దామెర్‌ను నిలబెట్టింది. ఆ తర్వాత భారత్‌ ఆదివాసీ పార్టీ  (BAP) అభ్యర్థి రాజ్‌కుమార్‌ రోట్‌కు తమ మద్దుతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని నామినేషన్ల ఉపసంహరణ చివరితేదీకి ఒక రోజు ముందు తీసుకొంది. బీఏపీకి మద్దతిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తమ అభ్యర్థి అరవింద్‌కు తెలియజేసింది. నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటానని చెప్పిన ఆయన.. ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి కనిపించకుండా పోయారు.

వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు

గడువు పూర్తయిన అనంతరం మీడియా ఎదుట ప్రత్యక్షమైన అరవింద్‌ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. భాజపా-కాంగ్రెస్‌ కూటమి మధ్య పోటీ ఉండగా.. దామెర్‌ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆయన కాంగ్రెస్‌ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. తద్వారా కాషాయ పార్టీకి లబ్ధి చేకూరవచ్చు. దీంతో అతడికి వ్యతిరేకంగా హస్తం పార్టీ ప్రచారం ప్రారంభించింది. తమ అభ్యర్థికి కాకుండా బీఏపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరుతోంది. ఈ ప్రాంతంలో మహేంద్రజిత్ సింగ్ మాలవీయను భాజపా ఎన్నికల బరిలోకి దింపింది. అరవింద్‌ నిర్ణయంతో ఈ ప్రాంతంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని