Tamil Nadu: తమిళనాట సీతారామన్‌, జైశంకర్‌లను పోటీకి దింపాలి : అన్నాడీఎంకే నేత

భాజపాకు ధైర్యముంటే  నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌లను తమిళనాడు నుంచి పోటీకి దింపాలని అన్నాడీఎంకే నేత సవాల్‌ విసిరారు. 

Published : 02 Mar 2024 01:48 IST

చెన్నై: నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌(ఎన్డీఏ)తో తెగతెంపులు చేసుకున్న అఖిలభారత అన్నా ద్రవిడ మున్నేత్ర ఖజగం(ఏఐఏడీఎంకే) నేత కేపీ మునుస్వామి భాజపాకు సవాల్‌ విసిరారు. ధైర్యముంటే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌లను తమిళనాడులోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలన్నారు. ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా, నిర్మలా సీతారామన్‌ ఎగువ సభలో కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గురువారం జరిగిన పార్టీ కార్యక్రమంలో అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు కేపీ మునుస్వామి మాట్లాడుతూ భాజపాకు తమిళనాట ప్రజలు ఓటు వేస్తారనే నమ్మకముంటే ఇద్దరు తమిళ కేంద్ర మంత్రులను తమిళనాడు నుంచే పోటీకి నిలబెట్టండి. ఇక్కడి ప్రజలు ఎలా ఆలోచిస్తారో మీకే తెలుస్తుంది అని అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని నియోజకవర్గాల నుంచి నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌లను భాజపా బరిలోకి దించే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించిన కొద్ది రోజులకే మునుస్వామి పైవిధంగా స్పందించారు. భాజపా తమిళనాడులోని మిత్రపక్షాలతో సీట్ల ఒప్పందాలను కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేపట్టింది. ఈ వారంలో అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండియా కూటమిలో భాగమైన అధికార డీఎంకే, చిన్న సంస్థలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌,  కొంగు దేశ మక్కల్ కట్చితో ఒప్పందాలు చేసుకుంది. గతంలో తమిళనాడు, పుదుచ్చేరిలో పోటీ చేసి 10 స్థానాల్లో తొమ్మిది స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌పై చర్చ జరుగుతోంది. నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయం కూడా వీరితో చేరవచ్చు అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

నేడు భాజపా 100 మందికి పైగా పేర్లతో కూడిన మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఇందులో మోదీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని