ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ

పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని మద్యం వ్యాపారి ఇంటిపై గడిచిన మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.. శుక్రవారం 156 బ్యాగుల నిండా నగదును స్వాధీనం చేసుకున్నారు.

Published : 08 Dec 2023 18:19 IST

భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. మూడు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ జరుపుతున్న ఈ సోదాల్లో శుక్రవారం వరకూ రూ.220 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రజల నుంచి తీసుకున్న ప్రతి పైసా కక్కిస్తామని ప్రధాని మోదీ అన్నారు.

పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని మద్యం వ్యాపారి ఇంటిపై గడిచిన మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.. శుక్రవారం 156 బ్యాగుల నిండా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా స్వాధీనం చేసుకున్న బ్యాగుల్లో ఆరేడు బ్యాగులను మాత్రమే లెక్కించామని, వీటిల్లో రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రూ.220 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లైంది. సంబల్‌పుర్‌, బోలన్‌గిరి, టిట్లాగఢ్‌, బౌద్ధ్‌, సుందర్‌గఢ్‌, రౌర్కెలా, భువనేశ్వర్‌లో ఈ సోదాలు జరిగాయి. 

ఈ సోదాలపై సదరు కంపెనీ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ఝార్ఖండ్‌కు చెందిన ఎంపీకి కూడా లిక్కర్‌ కంపెనీతో సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, పీటీఐ ప్రతినిధులు సదరు ఎంపీకి ఫోన్‌ చేద్దామని ప్రయత్నిస్తే స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. రాంచీలోని ఆయన కార్యాలయానికి వెళితే ఎంపీ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. 

ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. నోట్ల కట్టలు బయటపడ్డ వార్తకు సంబంధించిన క్లిప్పింగును తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నోట్ల గుట్టలు చూసి నాయకులు చెప్పే నీతి వాక్యాలు వినాలని వ్యంగ్యంగా అన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ హామీ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా విరుచుకుపడింది. స్థానిక నేతలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ స్థాయిలో పన్ను ఎగవేయడం అసాధ్యమని భాజపా అధికార ప్రతినిధి మనోజ్‌ మహా పాత్రో విమర్శించారు. ఈ ఆరోపణలను బిజూ జనతాదళ్‌ ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు