Rahul Gandhi: సీఎం స్టాలిన్‌ కోసం రాహుల్‌ ‘స్వీట్‌’ గిఫ్ట్‌.. స్వయంగా దుకాణానికి వెళ్లి..

Rahul Gandhi- MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఓ స్వీట్‌ ఇచ్చారు. దాన్ని అందుకున్న ముఖ్యమంత్రి.. వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి ఇలాంటి తీపి విజయం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated : 13 Apr 2024 12:36 IST

చెన్నై: తమిళనాడు (Tamil Nadu) పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి.. ఓ ‘స్వీట్‌’ గిఫ్ట్‌ తీసుకున్నారు. ఆ కానుకను అందుకున్న సీఎం.. రాహుల్‌ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

కొయంబత్తూరులో స్టాలిన్‌తో కలిసి రాహుల్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సభ అనంతరం నిన్న రాత్రి సింగనల్లూరులోని ఓ మిఠాయి దుకాణానికి రాహుల్‌ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంది. అందులో కాంగ్రెస్‌ నేత రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటి దుకాణానికి వెళ్లారు.

రాజకీయ తెరపై తారల తళుకులు.. తమిళనాట పరిస్థితి ఇలా..

రాహుల్‌ను చూసి షాపు సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏం కావాలి సర్‌? అని అడగ్గా.. ‘మా బ్రదర్‌ స్టాలిన్‌ కోసం మైసూర్‌ పాక్‌ కొనాలి’ అని చెప్పడం వీడియోలో ఉంది. ఈ సందర్భంగా షాప్‌లోని మిఠాయిలను రాహుల్‌ రుచిచూశారు. అనంతరం ఆ స్వీట్లను తీసుకుని స్టాలిన్‌ ఇంటికి వెళ్లి సీఎంకు అందించారు.

ఈ వీడియోకు స్టాలిన్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘నా సోదరుడు రాహుల్‌ గాంధీ స్వీట్‌ కానుకతో నా హృదయం నిండిపోయింది. జూన్‌ 4న (ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ) ఇండియా కూటమి కూడా తప్పకుండా ఇలాంటి తీపి విజయాన్నే అందుకుంటుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు