PM Modi: కృత్రిమ మేధా రంగంలో ముందడుగుకు యత్నాలు..: మోదీ

భారత్‌ కృత్రిమ మేధ రంగంలో భారీ పురోగతి సాధించడంపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కృత్రిమమేధపై జరగనున్న జీపీఏఐ కార్యక్రమానికి ప్రజలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

Published : 08 Dec 2023 18:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర దేశాలకు కొన్ని తరాల సమయం పట్టేంత అభివృద్ధిని భారత్‌ కేవలం కొన్నేళ్లలోనే సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఆన్‌ ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సమ్మిట్‌-2023(GPAI)కు ప్రజలను ఆహ్వానించారు. దీనిని కృత్రిమమేధ రంగంలో భారీగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన కీలక కార్యక్రమంగా అభివర్ణించారు. ఏఐలో చురుకైన భాగస్వామం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌ అద్భుతమైన స్టార్టప్‌ వాతావరణం ఉన్న యువ దేశమన్నారు.

విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి.. అత్యధికంగా కెనడాలోనే

‘‘గత పదేళ్లలో భారతీయులు టెక్నాలజీ సాయంతో గణనీయమైన అభివృద్ధి సాధించారు. అతి స్వల్ప సమయంలోనే భారత్‌ దీనిని అందుకోవడం అతిశయోక్తి కాదు’’ అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. అదే విధంగా కృత్రిమ మేధా రంగంలో ముందడుగు వేసి ప్రజలను బలోపేతం చేయాలనుకుంటున్నామన్నారు. దేశంలో వైద్యం అందరికీ అందుబాటులో తేవడం.. వ్యవసాయంపై అందరికీ మెరుగైన సమాచారం అందేలా చూడటమే లక్ష్యమని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ సహ వ్యవస్థాపక దేశంగా ఉన్న జీఏపీఐ ఫోరం ఐరోపా సమాఖ్య, మరో 28 దేశాలను ఈ వేదికపైకి తెస్తోందని మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా మార్గనిర్దేశం చేసేలా కలిసి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ ఎక్స్‌పో కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

ప్రభుత్వం కృత్రిమ మేధపై దృష్టిపెట్టింది. ఇటీవల డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ధ్రువీకరించుకునే వ్యవస్థ దేశంలో చాలామంది వద్ద లేదన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే డీప్‌ఫేక్‌ పోస్టుల నియంత్రణకు త్వరలో కొత్త నిబంధనలు విడుదల చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. తాజా పోస్టులో కృత్రిమ మేధ బాధ్యతాయుత వినియోగాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు