Indian students: విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి.. అత్యధికంగా కెనడాలోనే

Indian students: గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కెనడాలో అత్యధిక మరణాలు సంభవించాయి.

Updated : 08 Dec 2023 10:53 IST

దిల్లీ: హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం.. ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో (foreign countries) చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది భారతీయ విద్యార్థులు (Indian students) అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి ఇప్పటివరకు 400 మందికి పైనే విద్యార్థులు విదేశాల్లో మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడా (Canada)లోనే చోటుచేసుకున్నట్లు తెలిపింది.

ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో మొత్తంగా 34 దేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. అత్యధికంగా కెనడాలో 91 మంది మృతిచెందారు. ఆ తర్వాత యూకేలో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20, సైప్రస్‌లో 14, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో 10 మంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

కెనడాలో భారతీయ చిత్రాలు ఆడుతున్న థియేటర్లలో కలకలం

అయితే, అత్యధికంగా కెనడాలోనే భారతీయ విద్యార్థులు మరణించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చిని ప్రశ్నించగా.. ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పడం గమనార్హం. ‘‘ఇది (కెనడాలో అత్యధిక మరణాలు ఉద్దేశిస్తూ) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సమస్య అవునో కాదో ఇప్పుడే చెప్పలేం. ఇందులో కొన్ని వ్యక్తిగత కారణాలతో చోటుచేసుకున్న మరణాలు ఉన్నాయి. కుట్రలు, ఇతర కారణాలతో చోటుచేసుకున్న మరణాలపై ఇప్పటికే మా కాన్సులేట్‌ అధికారులు ఆయా కుటుంబాలను సంప్రదించాయి. అలాంటి కేసులను మేం స్థానిక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం’’ అని బాగ్చి వెల్లడించారు.

ఇటీవల కెనడాలో కొందరు భారతీయ విద్యార్థులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు, భారత్‌-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని, అందువల్ల అక్కడి భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ఆ మధ్య కేంద్రం అడ్వైజరీ కూడా జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని