India-Canada: ఎయిరిండియాకు ఖలిస్థానీ బెదిరింపులు.. కెనడాకు భారత్‌ అభ్యర్థన

India-Canada: ఎయిరిండియా (Air India) విమానాలకు ఖలిస్థానీ నుంచి బెదిరింపులు రావడంతో భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఆ విమానాలకు భద్రత కల్పించాలని కెనడాను కోరింది. 

Published : 06 Nov 2023 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిరిండియా (Air India) ప్రయాణికులను హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో స్పందించిన భారత్‌.. ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిరిండియా విమానాలకు భద్రత పెంచాలని కోరింది. అసలేం జరిగిందంటే..

భారత్‌లోని సిక్కు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఖలిస్థాన్‌ వేర్పాటువాది, ‘సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ గతవారం ఓ వీడియో విడుదల చేయడం తీవ్ర కలకలం రేపింది. అందులో అతడు ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర హెచ్చరికలు చేశాడు. నవంబరు 19న ఎయిరిండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని అన్నాడు. భారత్‌లోని సిక్కులెవరూ ఆ రోజున ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని హెచ్చరించాడు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏ చోటా ఎయిరిండియా విమానాలను అనుమతించబోమని చెప్పాడు. ఇక, దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరునూ మార్చేస్తామని వీడియోలో హెచ్చరించాడు. అదే రోజున అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయాన్ని కూడా పన్నూ ప్రస్తావించాడు.

నిజ్జర్‌ హత్య దర్యాప్తును తారుమారు చేస్తున్నారు

ఈ వీడియో తీవ్ర దుమారం రేపడంతో కెనడాలోని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ దీనిపై స్పందించారు. ‘‘ఈ హెచ్చరికలను సంబంధిత కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కెనడా-భారత్‌ మధ్య నడిచే విమానాలకు అదనపు భద్రత కల్పించాలని కోరాం. ఈ విషయమై అధికారులతో చర్చలు జరుపుతున్నాం’’ అని వర్మ ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. దిల్లీ నుంచి టొరంటో, వాంకోవర్‌కు ఎయిరిండియా నేరుగా విమానాలు నడుపుతోంది.

మరోవైపు, కెనడాలో భారత దౌత్యవేత్తలకు ప్రమాదం పొంచి ఉందని సంజయ్‌ వర్మ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎయిరిండియా విమానాలకు ఖలిస్థానీ హెచ్చరికలు చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారేలా కన్పిస్తున్నాయి.

1985లో ఎయిరిండియా విమానం కనిష్కపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. లండన్‌ మీదుగా కెనడా నుంచి భారత్‌కు వస్తున్న ఎయిరిండియా విమానం కనిష్క.. ఐరిష్ కోస్ట్‌ వద్ద గాల్లోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 268 మంది కెనడా పౌరులు, 24 మంది భారతీయులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని