Rajnath Singh: ‘ఉగ్రవాదులు పాక్‌ పారిపోయినా’..: రక్షణమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్‌

తాము పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ స్నేహమే కోరుకుంటామని, అవతలివారు శాంతికి విఘాతం కలిగించాలని చూస్తే సహించబోమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.

Updated : 06 Apr 2024 10:11 IST

దిల్లీ: పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్రంగా స్పందించారు. దేశ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చిచెప్పారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వైఖరిని స్పష్టం చేశారు.

‘‘దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలం. అక్కడికి వెళ్లి మరీ మట్టుపెడతాం. ప్రధాని మోదీ చెప్పింది అక్షరాలా నిజం. భారత్‌ శక్తిని పాకిస్థాన్‌ అర్థం చేసుకోవడం ప్రారంభించింది. అలాగే భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదు. వారి భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదు. తన పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుంది. ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించదు’’ అని స్పష్టం చేశారు.

బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్‌’ పత్రిక భారత్‌పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూదిల్లీ లక్ష్యంగా చేసుకొందని పేర్కొంది. భారత విదేశీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్‌, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథనం రాసినట్లు పేర్కొంది. దీనిపై ఇప్పటికే మన విదేశాంగ శాఖ స్పందించింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలు భారత్ ప్రభుత్వ విధానం కాదని పునరుద్ఘాటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని