India-Pakistan: సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్‌కు భారత్ నోటీసు
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) మార్చుకుందామంటూ పాకిస్థాన్‌కు భారత్ నోటీసు జారీ చేసింది. ఈ ఒప్పందంలో పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
దిల్లీ: సింధు నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్ (Pakistan)కు భారత్ (India) నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సింధు జలాల ఒప్పంద కమిషనర్ల ద్వారా జనవరి 25న ఈ నోటీసు పంపినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం అమలుపై పాక్ మొండి వైఖరి కారణంగానే ఈ నోటీసు పంపించాల్సి వచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
‘‘సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) స్ఫూర్తితో అమలు చేసే విషయంలో భారత్ ఎల్లప్పుడూ కృతనిశ్చయంతో, బాధ్యతతో ఉంది. కానీ, పాక్ చర్యలు.. ఒప్పందం నిబంధనలు, అమలుకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఫలితంగా ఒప్పందాన్ని సవరించుకునేందుకు భారత్ ఇప్పుడు బలవంతంగా నోటీసు జారీ చేయాల్సి వచ్చింది’’ అని సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ నోటీసుతో 90 రోజుల్లోగా భారత్, పాక్ మధ్య చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది. గత 62 ఏళ్ల కాలంలో నేర్చుకున్న పాఠాలతో ఈ ఒప్పందాన్ని (IWT) అప్‌డేట్ చేసుకునేందుకు వీలు లభించినట్లవుతుంది. కిషన్‌గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత ఐదేళ్లుగా పాక్ చర్చలకు నిరాకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నోటీసును పంపాల్సి వచ్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్.. వాటిని పరిశీలించేందుకు తటస్థ నిపుణులు కావాలని 2015లో అభ్యర్థన చేసింది. అయితే ఆ తర్వాత ఏడాదే ఆ అభ్యర్థనను వెనక్కి తీసుకున్న దాయాది.. మధ్యవర్తిత్వ న్యాయస్థానం తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది. అయితే పాక్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంక్‌కు అభ్యర్థన చేసింది. ఈ పరిణామాలపై 2016లో ప్రపంచ బ్యాంక్ స్పందిస్తూ.. ఇరు దేశాల అభ్యర్థనలను నిలిపివేసింది. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని భారత్, పాక్‌కు సూచించింది. అయితే, పాక్ ఒత్తిడి మేరకు.. ఇటీవల ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రారంభించింది. దీంతో భారత్ స్పందించింది. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపించింది. ఇలాంటి ఉల్లంఘనల కారణంగానే ఒప్పందం సవరణకు నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అసలేంటీ ఒప్పందం..
సింధు నదీ జలాల వివాదానికి పరిష్కరించుకునేందుకు భారత్, పాక్ మధ్య 1960 సెప్టెంబరు 19న ఈ ఒప్పందం (Indus Waters Treaty) జరిగింది. ఈ ఒప్పందంపై భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. సింధు జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు దక్కాయి. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు ‘సింధు శాశ్వత కమిషన్’ ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Liquor Scam: మనీశ్ సిసోదియాకు బెయిల్ నిరాకరణ
-
Sports News
Ravindra jadeja: సీఎస్కేకు మద్దతు ఇవ్వండి.. గుజరాత్ అభిమానులకు జడేజా విజ్ఞప్తి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Education News
TS Eamcet: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!
-
Politics News
Andhra News: మంత్రి పదవి ఉన్నా.. లేకపోయినా బాధపడను: మంత్రి అప్పలరాజు
-
Sports News
Hardik Pandya: ఆ కల తీరిపోయింది.. ఇక అదే మా లక్ష్యం: హార్దిక్ పాండ్య