India-Canada: ‘మేం కాదు.. మీరు’: కెనడా ఎన్నికల్లో జోక్యంపై ఆరోపణలు..ఖండించిన భారత్‌

తమ ఎన్నికల్లో జోక్యంపై కెనడా(Canada) చేసిన ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. 

Published : 08 Feb 2024 19:03 IST

దిల్లీ: భారత్‌ విషయంలో కెనడా (India-Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) వ్యవహరిస్తోన్న తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. తమ ఎన్నికల్లో జోక్యం గురించి ఆ దేశం చేసిన ఆరోపణలకు భారత్‌ ఘాటుగా బదులిచ్చింది. ఈమేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియాతో మాట్లాడారు.

‘విదేశీ జోక్యంపై కెనడియన్ కమిషన్‌ విచారణ జరుపుతోందంటూ వెలువడిన మీడియా కథనాలు మా దృష్టికి వచ్చాయి. కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం ఉందన్న నిరాధారమైన ఆరోపణలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్‌ విధానం కాదు. నిజానికి కెనడానే మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. ప్రతిసారీ ఈవిషయాన్ని వారివద్ద ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మా ఆందోళనలపై తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూనే ఉన్నాం’ అంటూ కెనడా ఆరోపణలకు రణధీర్‌ జైశ్వాల్ గట్టి సమాధానం చెప్పారు.

భారత్‌-మయన్మార్‌ మధ్య ఇక యథేచ్ఛగా రాకపోకలు కుదరవ్‌

తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా(China) యత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఇటీవల ఆ దర్యాప్తులో భారత్‌ పేరు కూడా చేర్చి, కెనడా మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ఇదిలాఉంటే.. గతేడాది జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. వాటిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని న్యూదిల్లీ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో జోక్యంపై కెనడా ఆరోపణలు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని