PM Modi: హమాస్‌తో యుద్ధం వేళ.. మోదీకి నెతన్యాహు ఫోన్‌

Israel Hamas Conflict: హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) మరోసారి స్పష్టం చేశారు. తాజాగా ఆయనకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఫోన్‌ చేసి అక్కడి పరిస్థితిని వివరించారు.

Updated : 10 Oct 2023 17:10 IST

దిల్లీ: హమాస్‌ మిలిటెంట్ల (Hamas militants)పై ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం భీకర పోరు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Israeli PM Benjamin Netanyahu).. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)కి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

‘‘ఇజ్రాయెల్‌ -హమాస్‌ మధ్య ఘర్షణలు, అక్కడి తాజా పరిస్థితుల గురించి నెతన్యాహు ఫోన్‌ చేసి తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు యావత్‌ భారతావని అండగా నిలుస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే.. దాన్ని భారత్‌ నిస్సందేహంగా, తీవ్రంగా ఖండిస్తుంది’’ అని మోదీ (PM Modi) ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు.

బందీలకు ఏదైనా జరిగితే.. మిమ్మల్ని వదలం..: హమాస్‌ను హెచ్చరించిన ఇజ్రాయెల్‌

తమ దేశంలోకి చొరబడి మారణహోమం సృష్టించిన హమాస్‌ మిలిటెంట్లను తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. మరోవైపు తమ భూభాగంలోకి చొరబడిన దాదాపు 1500 మంది హమాస్‌ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.

హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి నెతన్యాహు మాట్లాడారు. తమ దేశంపై దాడి చేసి హమాస్‌ ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని తాము మొదలుపెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అన్నారు. తమ ప్రతిదాడి హమాస్‌తో పాటు, ఇజ్రాయెల్‌ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని