Israel: బందీలకు ఏదైనా జరిగితే.. మిమ్మల్ని వదలం..: హమాస్‌ను హెచ్చరించిన ఇజ్రాయెల్‌

గాజాలో బందీలకు ప్రాణహాని జరిగితే హమాస్‌ దారుణ పరిస్థితిని ఎదుర్కొంటుందని ఇజ్రయెల్‌ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు గాజాపై యుద్ధం చేస్తే మాత్రం బందీలను చంపేస్తామని హమాస్‌ ప్రకటించింది.

Updated : 10 Oct 2023 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్‌ చేసి గాజాకు తీసుకువెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్‌ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడీఎఫ్‌ (ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌ దళాల ప్రతినిధి రిచర్డ్‌ మాట్లాడుతూ ‘‘ బందీలుగా ఉన్నవారిలో ఒక్క వృద్ధురాలికైనా.. ఒక్క పసికందుకైనా వారు హాని చేస్తే.. అది హమాస్‌ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఈ విషయం వారికీ తెలుసు’’ అని హెచ్చరించారు. అంతేకాదు.. తాము ఎటువంటి హెచ్చరికలు లేకుండా బాంబింగ్‌ చేయమని వెల్లడించారు. ఐడీఎఫ్‌ దాడికి ముందు సోషల్‌ మీడియాలో పోస్టు చేసి లేదా వార్నింగ్‌ షాట్స్‌ పేల్చి హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. సామాన్య ప్రజలు కూడా ఆ ప్రదేశాల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తామన్నారు.

గాజాలోని పౌర, ప్రభుత్వ, సైనిక భవనాలను ఇజ్రాయెల్‌ దళాలు గుర్తించి దాడి చేస్తున్నాయా..? అన్న ప్రశ్నకు ఐడీఎఫ్‌ ప్రతినిధి స్పందిస్తూ..‘‘అక్కడ ప్రజలు ఉండే భవనాల్లోనే ఆయుధాలు ఉంచడంతోపాటు.. హమాస్‌ నాయకులు కూడా దాక్కొంటున్నారు’’ అని రిచర్డ్‌ వెల్లడించారు.

మరోవైపు ఇజ్రాయెల్‌ దళాలు పూర్తి స్థాయిలో గాజాపై నియంత్రణ సాధించే దిశగా అడుగు వేయడంతో హమాస్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఆ సంస్థ ప్రతినిధి అబు ఉబైద మాట్లాడుతూ.. తాము ఇప్పటి వరకు ఇస్లాం ప్రకారం బందీలను సురక్షితంగా ఉంచామని తెలిపాడు. అయితే ఇజ్రాయెల్‌ జరిపే ప్రతి ఒక్క బాంబింగ్‌కు ఓ పౌరుడిని హత్య చేస్తామని హెచ్చరించాడు. 

మాయమైన మానవత్వం!

ఇప్పటికే ఇజ్రాయెల్‌ దాదాపు 3,00,000 మంది సైన్యాన్ని సమీకరించి హమాస్‌పై దాడి చేసేందుకు సిద్ధం చేస్తోంది. విదేశాల్లో ఉన్న వందల మంది ఇజ్రాయెల్‌ సైనికులు మాతృభూమికి తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇజ్రాయెల్‌ 35 బెటాలియన్లను గాజా సరిహద్దులకు తరలించింది. భవిష్యత్తులో ఇక్కడ ఆపరేషన్ల కోసం అవసరమైన బేస్‌లు, వసతులు నిర్మిస్తోంది. గాజాలో భారీగా పదాతిదళం పోరాడాల్సి ఉంటుందని ఆ దేశం విశ్వసిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని