Kejriwal arrest: కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

Kejriwal arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

Published : 27 Mar 2024 14:11 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టు వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నామధ్య జర్మనీ దీనిపై ప్రకటన విడుదల చేయగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా (USA) కూడా స్పందించింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన భారత్‌ చర్యలు చేపట్టింది. దిల్లీలోని యూఎస్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

ఈ క్రమంలోనే అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనా బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 30 నిమిషాల పాటు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె వద్ద భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ‘‘దౌత్య సంబంధాల్లో ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని మేం భావిస్తున్నాం. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేదంటే సంబంధాలు దెబ్బతింటాయి. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయి. దీనిపై అంచనాలు వేయడం సరికాదు’’ అని అగ్రరాజ్యానికి విదేశాంగశాఖ స్పష్టంగా చెప్పింది.

ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్‌ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన

కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈ-మెయిల్‌లో అడిగిన ఓ ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మంగళవారం బదులిచ్చారు. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై దిల్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అంతకుముందు జర్మనీ విదేశాంగశాఖ కూడా ఇదే విధమైన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. ఆ దేశ రాయబారికి సమన్లు ఇచ్చింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని