Kejriwal Arrest: కేజ్రీవాల్‌ అరెస్టుపై జర్మనీ ప్రకటన.. తీవ్రంగా మండిపడ్డ కేంద్రం

Kejriwal Arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుపై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యమే అవుతుందని మండిపడింది.

Updated : 23 Mar 2024 19:46 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ (ED) అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై జర్మనీ (Germany) విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్‌ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) పిలిచి నిలదీసింది. అసలేం జరిగిందంటే..

కేజ్రీవాల్‌ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

‘అరెస్టు ఆశ్చర్యపర్చలేదు’: కేజ్రీవాల్ సందేశాన్ని వెల్లడించిన సతీమణి

జర్మనీ స్పందనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. దీంతో ఈ ఉదయం జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్‌ జార్జ్‌ ఎంజ్‌వీలర్‌ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన వద్ద భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.

మద్యం పాలసీకి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిన్న కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే జైలు నుంచి ఆయన పంపిన సందేశాన్ని సీఎం సతీమణి సునీత కేజ్రీవాల్‌ నేడు చదివి వినిపించారు. తనను సుదీర్ఘకాలం కటకటాల వెనక ఉంచే జైలే లేదని ముఖ్యమంత్రి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని