GSAT-20: ‘స్పేస్‌ఎక్స్‌’ రాకెట్‌లో నింగిలోకి భారత ఉపగ్రహం..!

అంతరిక్ష ప్రయోగం నిమిత్తం భారత్‌ మొదటిసారి ‘స్పేస్‌ఎక్స్‌’ సేవలను వినియోగించుకోనుంది. ఆ సంస్థ రాకెట్‌ ద్వారా మన ఉపగ్రహాన్ని పంపనుంది.

Published : 03 Jan 2024 18:56 IST

దిల్లీ: అంతరిక్ష రంగంలో మరింత పురోగతి సాధించే దిశగా భారత్‌ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ శాటిలైట్‌ ‘జీశాట్‌-20 (GSAT-20 satellite)’ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే, ఈసారి ‘స్పేస్‌ఎక్స్‌ (SpaceX)’కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ (Falcon-9 Rocket) ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 4,700 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని.. రిమోట్‌ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించారు.

‘భారత స్పేస్‌ స్టేషన్‌’ కోసం ఇస్రో ముందడుగు.. నింగిలోకి ఫ్యుయల్‌ సెల్‌

‘జీశాట్‌-20’ ప్రయోగం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తొలిసారి ఫాల్కన్‌-9 సేవలను వినియోగించుకోనుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లే అవకాశం ఉందని ఆ కథనాలు పేర్కొన్నాయి. సమయానికి మరే రాకెట్ అందుబాటులో లేనందున స్పేస్‌ఎక్స్‌ సేవలను వినియోగించుకోవాల్సి వస్తోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ తెలిపారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నిర్వహించనున్న ఈ ప్రయోగం కోసం స్పేస్‌ఎక్స్‌తో ఇస్రో ఒప్పందం చేసుకుంది. భారీ ఉపగ్రహాల ప్రయోగాలపై ఇప్పటివరకు ఫ్రాన్స్‌ నేతృత్వంలోని ఏరియన్‌స్పేస్‌ కన్సార్టియంపై భారత్‌ ఆధారపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని