ISRO: ‘భారత స్పేస్‌ స్టేషన్‌’ కోసం ఇస్రో ముందడుగు.. నింగిలోకి ఫ్యుయల్‌ సెల్‌

ISRO: కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఇందులో భాగంగానే ఓ ఫ్యుయల్‌ సెల్‌ను కూడా ఇస్రో నింగిలోకి పంపించింది. భవిష్యత్తులో భారత్‌ రోదసిలో నిర్మించబోయే అంతరిక్ష కేంద్రానికి ఇది కీలకం కానుంది.

Updated : 01 Jan 2024 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తులో భారత్‌ (India).. భూకక్ష్యలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (Space Station) ఏర్పాటు చేసుకోవడం కోసం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇస్రో (ISRO) అంతరిక్షంలో కీలకమైన శక్తివనరుల వినియోగంపై ప్రయోగం చేపట్టింది. ఈ క్రమంలో సరికొత్త ఫ్యుయల్ సెల్‌ను సోమవారం విజయవంతంగా దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) ప్రయోగ విజయంతో ఈ నూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉత్సాహంగా ప్రారంభించింది. ఈ వాహకనౌకతో ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’ (XPoSat)ను నేడు అంతరిక్షంలోకి పంపారు. ఇదే వాహకనౌక చివరి దశలో మరో పది పరికరాలను  అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఫ్యుయల్‌ సెల్‌ పవర్‌ సిస్టమ్‌ (FCPS) కూడా ఒకటి. ‘పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌ (POEM)’లో భాగంగా దీన్ని నింగిలోకి పంపించింది.

కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం.. ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతం

ఈ ఫ్యుయల్‌ సెల్‌ టెక్నాలజీని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది. రోదసిలో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరును భారత్‌కు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది. ఈ  టెక్నాలజీ.. రసాయన శక్తిని నేరుగా ఎలక్ట్రోకెమికల్‌ రియాక్షన్‌తో విద్యుత్‌ శక్తిగా  మారుస్తుంది. సుదీర్ఘ కాలం పాటు అంతరిక్ష కేంద్రానికి కరెంట్‌ను ఇది సరఫరా చేయగలదు. భవిష్యత్తులో భారత్‌ నిర్మించబోయే స్పేస్‌ స్టేషన్‌ కోసం ఈ ప్రయోగం కీలక ముందడుగు.

రోదసిలో భారత్‌ సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకునే దిశగా కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని మోదీ కూడా దీనిపై మాట్లాడుతూ.. మరో పదేళ్లలో ఈ స్పేస్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యం పెట్టుకోవాలని శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.

ఇది ఆరంభం మాత్రమే: సోమ్‌నాథ్‌

నేటి ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ మాట్లాడారు. ‘‘పీఎస్‌ఎల్‌వీ ప్రయోగ విజయంతో ఈ నూతన సంవత్సరాన్ని మొదలుపెట్టాం. ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని ఈ వాహకనౌక విజయవతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ ఏడాది మరిన్ని కీలక ప్రయోగాలున్నాయి. ఈ 2024.. మిషన్‌ గగన్‌యాన్‌ సంవత్సరంగా నిలవనుంది’’ అని సోమ్‌నాథ్ ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని